Back to Home
Watermark
సోమవారం, 21 సెప్టెంబర్, 2026 TIME : 01:32 PM

మానకొండూర్ మండలంలో గణేష్ విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లపై సమీక్ష, చెరువు కట్ట పరిశీలన

Main Image

మానకొండూర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:

మానకొండూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ పరిధిలో గణేష్ విగ్రహాల నిమజ్జనం సజావుగా, భద్రంగా జరగాలనే లక్ష్యంతో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం స్థానిక చెరువు కట్టను మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ స్వయంగా పరిశీలించారు.

ఈ సమావేశంలో మండల అధికారులు, పోలీసు అధికారులు, పంచాయతీ సిబ్బంది, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. నిమజ్జన స్థలం వద్ద భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్ సరఫరా, తాత్కాలిక లైటింగ్, తాగునీరు, వైద్య సౌకర్యాలు, అగ్నిమాపక వాహనాల సిద్ధత వంటి అంశాలపై వివరంగా చర్చించారు. పెద్ద విగ్రహాలను క్రేన్ల సాయంతో నిమజ్జనం చేయడం, చిన్న విగ్రహాలకు ప్రత్యేక స్థలాలు కేటాయించడం, ప్లాస్టిక్ మరియు రసాయన రంగుల వాడకాన్ని నియంత్రించి పర్యావరణాన్ని కాపాడడం వంటి సూచనలు జారీ చేశారు.

Additional Image

సమావేశం అనంతరం చెరువు కట్ట వద్దకు వెళ్లి నీటి మట్టం, కట్ట బలం, ప్రవేశ మార్గాలు, పార్కింగ్ స్థలాలు అనుకూలంగా ఉన్నాయో లేవో పరిశీలించారు. ఏమైనా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు.

భక్తులు సురక్షితంగా విగ్రహాలను నిమజ్జనం చేసి ఇంటికి చేరుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గణేష్ ఉత్సవాలు భక్తితో పాటు క్రమశిక్షణతో జరగాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. నిమజ్జనం తర్వాత చెరువు పరిశుభ్రతను కూడా వెంటనే చేపట్టాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Clip Adjustments