Back to Home
Watermark
సోమవారం, 21 సెప్టెంబర్, 2026 TIME : 07:21 PM

బీసీ సంక్షేమ శాఖపై ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం

Main Image

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా:

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, విద్యా కార్యక్రమాలపై మినిస్టర్ క్వార్టర్స్‌లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బీసీ మహిళలకు అందిస్తున్న 'ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు' పథకం అమలు, అప్లికేషన్ ప్రక్రియ, అలాగే బీసీ గురుకులాలు, హాస్టళ్ల పనితీరు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు: ఈ పథకం కింద ఇప్పటివరకు 4 లక్షల 6 వేల దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ గడువు ఈ నెల 30వ తేదీతో ముగియనున్నందున, అర్హులైన ప్రతి బీసీ మహిళకు పథకం ప్రయోజనం అందేలా ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

గురుకులాలు, హాస్టళ్లలో నాణ్యమైన విద్య - పౌష్టికాహారం: మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థలు, బీసీ హాస్టళ్ల పనితీరును సమీక్షించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలని స్పష్టం చేశారు. పాఠ్యప్రణాళికతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, గత ఏడాది కంటే ఈ సంవత్సరం మరింత మెరుగైన ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు, విద్యార్థులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు, సిబ్బంది నియామకాలు, డిజిటల్ విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై కూడా చర్చించారు.

బీసీల ఆర్థికాభివృద్ధి - స్టడీ సర్కిల్స్: బీసీల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బీసీ విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందించేందుకు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా నైపుణ్యాభివృద్ధితో పాటు పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు చదువుతో పాటు వివిధ రంగాల్లో ప్రతిభను చాటేలా అవసరమైన అవకాశాలు కల్పించాలన్నారు.

సొంత భవనాల నిర్మాణం: రాష్ట్రంలో మొత్తం 327 బీసీ గురుకుల పాఠశాలలు ఉండగా, ప్రస్తుతం కేవలం 21 పాఠశాలలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయని అధికారులు వివరించారు. మిగిలినవి అద్దె భవనాల్లో కొనసాగుతున్న నేపథ్యంలో, వివిధ జిల్లాల్లో సొంత భవనాల నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని స్థల సేకరణ చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటికే స్థలం అందుబాటులో ఉన్న పాఠశాలలకు భవనాల నిర్మాణం చేపట్టేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో చర్చించి నిధులు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

పరిశుభ్రత - సమన్వయం: గురుకులాలు, హాస్టళ్ల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచి, విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని సూచించారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు బాధ్యతాయుతంగా, సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.

Clip Adjustments