వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్.. 30 రోజుల్లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశం

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా:
వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయడానికి గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ, పనుల్లో జాప్యం జరుగుతుండటంపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే 30 రోజుల్లోగా 24 గంటలూ నిరంతరం పనులు కొనసాగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ మేరకు ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌తో పాటు ఇతర ఆసుపత్రుల నిర్మాణాలపై ముఖ్యమంత్రి గారు ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వరంగల్ హాస్పిటల్ భవన నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయడంపై ఈ సందర్భంగా పలు కీలక సూచనలు చేశారు.
సమావేశంలోని ముఖ్యాంశాలు:
నిరంతర పర్యవేక్షణ: పనులకు సంబంధించి ప్రత్యేకంగా షెడ్యూల్ తయారు చేసి అందుకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని చెప్పారు. సీఎంఓ అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతి పనికి ఒక ప్రత్యేక అధికారికి బాధ్యత అప్పగించాలని, ఇకనుంచి ప్రతిరోజూ ఆసుపత్రి పనులను పరిశీలించాలని కలెక్టర్ గారిని ఆదేశించారు.
సమన్వయ కమిటీ ఏర్పాటు: భవన నిర్మాణం విషయంలో వివిధ శాఖల మధ్య సమన్వయంతో పని చేయాలని, అధికారులతో ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాలు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే విధంగా తగిన విధంగా తీర్చిదిద్దాలని చెప్పారు.
ఓపీ సేవలు మరియు వసతులు: సనత్‌నగర్ ఎంసీఆర్ టిమ్స్ తరహాలో వరంగల్ ఆసుపత్రిలో కూడా త్వరగా ఓపీ సేవలు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. సనత్‌నగర్ టిమ్స్‌లో స్టాఫ్ క్వార్టర్స్‌ను నిర్మించాలని, అందుకు సంబంధించిన పనులను తక్షణమే ప్రారంభించాలని స్పష్టం చేశారు. అలాగే హాస్పిటల్ నిర్వహణ బాధ్యతలను ఏజెన్సీకి అప్పగించాలని సూచించారు.
ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి గారితో పాటు వైద్య ఆరోగ్య, రోడ్లు - భవనాలు, మున్సిపల్ శాఖల ఉన్నతాధికారులు, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.