తెలంగాణలో నిరంతర క్రీడా ఉద్యమం ‘ఖేలో తెలంగాణ’ ప్రారంభం.పోస్టర్ ఆవిష్కరించిన క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా:
తెలంగాణలో క్రీడా సంస్కృతిని మరింత విస్తృతం చేయడంతో పాటు, శారీరక చైతన్యాన్ని ప్రజల దైనందిన జీవితంలో భాగం చేసి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ క్రీడా శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో “ఖేలో తెలంగాణ” పేరుతో నిరంతర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి గారి చేతుల మీదుగా ‘ఖేలో తెలంగాణ’ పోస్టర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది.
సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ డాక్టర్ సోనీ బాలాదేవి, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి మల్లారెడ్డి మరియు స్పోర్ట్స్ అథారిటీ అధికారులు పాల్గొన్నారు.
‘ఖేలో తెలంగాణ బంధన్’ ప్రత్యేకతలు:
నిరంతర ప్రక్రియగా సాగే ఈ కార్యక్రమంలో భాగంగా “ఖేలో తెలంగాణ బంధన్” ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం, ఫిట్నెస్ కోసం రోజుకు కనీసం 30 నిమిషాలు కేటాయించేలా ప్రజలను ప్రోత్సహించనున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ శారీరక వ్యాయామాన్ని అలవాటుగా మార్చుకునేలా దీనిని ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దుతున్నారు.
9+9+9 ఫిట్నెస్ ఛాలెంజ్:
“ఖేలో తెలంగాణ బంధన్”లో భాగంగా వినూత్నంగా 9+9+9 ఫిట్నెస్ ఛాలెంజ్‌ను నిర్వహించనున్నారు. వాకింగ్, జాగింగ్, యోగా తదితర కార్యకలాపాల్లో పాల్గొంటూ, వాటికి సంబంధించిన 27 సెకండ్ల వీడియోను సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేసి, 9 మంది మిత్రులను ట్యాగ్ చేస్తూ, మరో 9 మందిని ఈ ఛాలెంజ్‌కు ఆహ్వానించేలా కార్యక్రమాన్ని రూపొందించారు.
లీగ్‌ల ద్వారా క్రీడా సంస్కృతికి ప్రోత్సాహం:
“ఖేలో తెలంగాణ”ను కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా నిరంతర క్రీడా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లేలా వివిధ క్రీడాంశాల్లో లీగ్ పోటీలను నిర్వహించనున్నారు.
పాఠశాల స్థాయి నుంచి అన్ని వయస్సుల వారికి క్రీడల్లో పాల్గొనే అవకాశాలను కల్పించనున్నారు. రెజ్లింగ్, బాక్సింగ్, వాలీబాల్, టేబుల్ టెన్నిస్, జూడో, బాస్కెట్‌బాల్, అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, సైక్లింగ్, యోగాసనాలతో పాటు మరికొన్ని క్రీడాంశాల్లో ఈ పోటీలు జరగనున్నాయి.
ఫిట్నెస్ను ప్రజల జీవనశైలిలో భాగం చేయడం, క్రీడా ప్రతిభకు వేదికలు కల్పించడమే లక్ష్యంగా దశలవారీగా ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఈ బృహత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో క్రీడాభిమానులు, విద్యార్థులు, యువత, విద్యాసంస్థలు, క్రీడా సంఘాలు భాగస్వాములు కావాలని మంత్రి వాకిటి శ్రీహరితో పాటు సలహాదారు జితేందర్ రెడ్డి, ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఎండీ సోనీ బాలాదేవి పిలుపునిచ్చారు.