గణేష్ నిమజ్జనాలకు పటిష్టమైన చర్యలు.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఏర్పాట్లు: మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడా:
వినాయక నిమజ్జనం సజావుగా సాగేందుకు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రభుత్వపరంగా అన్ని పటిష్టమైన చర్యలు తీసుకున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్లో గణేశ్ నిమజ్జనానికి ముందు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తదితరులతో కలిసి పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం అన్ని జిల్లాల్లో జరుగుతున్న గణేష్ నిమజ్జనాలతో పాటు, ఈనెల 25న హైదరాబాద్లో నిర్వహించనున్న నిమజ్జనోత్సవాలకు కూడా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిమజ్జనోత్సవాల నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఆయన పేర్కొన్నారు.
వినాయక మండపాల ఏర్పాటుకు సంబంధించి కూడా ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించిందని, మండపాలకు ఉచిత విద్యుత్ వంటి సౌకర్యాలను కల్పించినట్లు వివరించారు.
భక్తులు నిమజ్జనోత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, ఎలాంటి అపశ్రుతులకు తావులేకుండా సహకరించాలని కోరారు.
రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని గణనాథుడిని ప్రార్థించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.