దసరా లోపు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయాలి: సీఎం ఎ. రేవంత్ రెడ్డి

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా:
దసరా లోపు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తికి అవసరమైన జీ-9 గ్రేడ్ బొగ్గు విషయంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి గారితో వెంటనే చర్చించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారికి సూచించారు.
సమావేశంలోని ముఖ్యాంశాలు:
విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కలిసి ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యాదాద్రి థర్మల్ కేంద్రంలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయకపోవడంపై అధికారులను ప్రశ్నించారు.
యాదాద్రి కేంద్రానికి జీ-9 గ్రేడ్ బొగ్గు అవసరమని, సింగరేణిలో ఆ గ్రేడ్ బొగ్గు ఉత్పత్తి చేసే బ్లాకులు లేవని, భవిష్యత్తులోనూ ఆ అవకాశం లేదని అధికారులు తెలిపారు. పిట్ హెడ్‌పై కాకుండా దూరంగా నిర్మించడం వల్ల రాష్ట్రంపై రూ. 40 వేల కోట్ల అదనపు భారం పడుతోందని వివరించారు.
గత ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనకపోవడం వల్లే సింగరేణి నుంచి సరఫరా సాధ్యం కాలేదని, సింగరేణిలో ఇప్పటికే 14 బొగ్గు బ్లాకులు మూతపడ్డాయని అధికారులు వెల్లడించారు.
ప్రస్తుత విద్యుత్ అవసరాల దృష్ట్యా మహానది కోల్ ఫీల్డ్స్, కోల్ ఇండియా నుంచి బొగ్గు కొనుగోలుకు చర్యలు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ఎత్తిపోతల పథకాల పంపులకు ఎలాంటి ఆటంకం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం సలహాదారు కె. రామకృష్ణారావుతో పాటు ఇంధన శాఖ, సింగరేణి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.