కరీంనగర్‌లో ప్రశాంతంగా, వైభవంగా ముగిసిన గణేష్ నిమజ్జనోత్సవాలు: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:
కరీంనగర్ నగరంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు మరియు గణేష్ నిమజ్జన వేడుకలు అత్యంత ప్రశాంతమైన, ఆధ్యాత్మిక వాతావరణంలో వైభవంగా ముగిశాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు తెలిపారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ మహా ఉత్సవాలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా దిగ్విజయంగా పూర్తి కావడానికి నగర ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు అందించిన నిరంతర సహకారం అభినందనీయమన్నారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యవేక్షణ: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సూచనల మేరకు నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నగరపాలక సంస్థ ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు. బండి సంజయ్ ఢిల్లీ నుంచే ప్రతి గంటకూ పరిస్థితులను సమీక్షిస్తూ అధికారులకు తగిన ఆదేశాలు అందించారని పేర్కొన్నారు.
భారీగా నిమజ్జనాలు: నగరవ్యాప్తంగా వివిధ మండపాల్లో ప్రతిష్టించిన దాదాపు 2,300 గణపతి విగ్రహాలను భక్తులు ఎంతో ఉత్సాహంతో, వర్షం కురుస్తున్నప్పటికీ ప్రశాంతంగా నిమజ్జనం చేశారని వివరించారు. చింతకుంట, మానకొండూర్, కొత్తపల్లి తదితర ప్రధాన నిమజ్జన ప్రాంతాల వద్ద ముందస్తు ఏర్పాట్లు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు.
ప్రత్యేక కృతజ్ఞతలు: నిమజ్జన ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి చివరి విగ్రహం వరకు తాము, మేయర్, కార్పొరేటర్లు, యంత్రాంగం క్షేత్రస్థాయిలోనే అందుబాటులో ఉండి పర్యవేక్షించామని తెలిపారు. ఉత్సవాల విజయవంతానికి సహకరించిన ప్రజలకు, మండపాల నిర్వాహకులకు, పారిశుధ్య కార్మికులకు, పోలీసు శాఖకు బీజేపీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.