Back to Home
Watermark
గురువారం, 24 సెప్టెంబర్, 2026 TIME : 11:11 PM

రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అల్లూరి సీతారామరాజు జిల్లా డీఆర్వో

Main Image

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా:

అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టరేట్‌లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మెరుపు దాడి చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో - ఎఫ్‌ఏసీ)గా విధులు నిర్వహిస్తున్న ఎం.వి.ఎస్. లోకేశ్వరరావు యాభై వేల రూపాయలు లంచం తీసుకుంటూ బుధవారం సాయంత్రం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. తన సొంత కార్యాలయంలోనే లంచం సొమ్ము తీసుకుంటుండగా అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

సహోద్యోగి నుంచే డిమాండ్: కలెక్టరేట్ కార్యాలయంలోనే పనిచేసే ఒక జూనియర్ అసిస్టెంట్‌కు సంబంధించిన జీతభత్యాల బకాయిలు, బిల్లుల ఫైల్‌ను క్లియర్ చేయడానికి డీఆర్వో లోకేశ్వరరావు రూ. 50,000 లంచం డిమాండ్ చేశారు. బాధితుడు అంత మొత్తాన్ని ఇచ్చుకోలేక విశాఖపట్నం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

కార్యాలయంలోనే రెడ్ హ్యాండెడ్‌గా: బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ బృందం పక్కా వ్యూహంతో పాడేరు కలెక్టరేట్‌కు చేరుకుంది. బుధవారం సాయంత్రం డీఆర్వో తన ఛాంబర్‌లో బాధితుడి నుంచి రూ. 50 వేల నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.

తేలిన కెమికల్ పరీక్షలు: లోకేశ్వరరావు చేతులకు జరిపిన కెమికల్ పరీక్షల్లో పాజిటివ్ అని తేలిందని, ఆయన వద్ద నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ జరుపుతున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

Clip Adjustments