Back to Home
Watermark
శుక్రవారం, 25 సెప్టెంబర్, 2026 TIME : 03:21 PM

ఆయిల్ పామ్ రైతుల నోట్లో మట్టి కొట్టేలా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Main Image

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:

ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ముడి పామాయిల్ దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయంపై తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు దేశంలో ఆయిల్ పామ్ సాగును విస్తరించాలని, రైతులను ఈ పంట వైపు మళ్లించాలని సూచిస్తూ.. మరోవైపు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పామాయిల్‌పై సుంకాన్ని తగ్గించడం కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు.

పంటను ప్రోత్సహిస్తూ.. ధరలను దెబ్బతీస్తున్నారు: “రైతును ఆయిల్ పామ్ సాగు చేయమని ప్రోత్సహిస్తారు.. కానీ రైతు పండించిన గెలలకు గిట్టుబాటు ధర వచ్చే పరిస్థితులను మాత్రం కేంద్రం దెబ్బతీస్తోంది. ఒక చేత్తో ఆయిల్ పామ్ వైపు నడిపిస్తూ.. మరో చేత్తో దిగుమతి సుంకం తగ్గించి విదేశీ పామాయిల్‌కు మార్కెట్‌ను సులభతరం చేయడం ఏ విధమైన రైతు అనుకూల విధానం?” అని మంత్రి ప్రశ్నించారు.

పెరిగిన దిగుమతి ఒత్తిడి: కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో క్రూడ్ పామ్ ఆయిల్‌పై మొత్తం దిగుమతి సుంకం 16.5 శాతం నుంచి 11 శాతానికి పడిపోయింది. దీంతో దిగుమతి చేసుకునే పామాయిల్‌కు పోటీ ప్రయోజనం పెరిగి, దేశీయంగా ఆయిల్ పామ్ గెలల ధరలపై తీవ్ర ఒత్తిడి ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

దీర్ఘకాలిక పంటపై దెబ్బ: ఆయిల్ పామ్ అనేది ఒక సీజన్‌లో పండించి వదిలేసే పంట కాదని, సంవత్సరాల తరబడి పెట్టుబడి పెట్టి, నీరు, ఎరువులు, నిర్వహణ ఖర్చులు భరిస్తూ సాగు చేసే దీర్ఘకాలిక పంట అని మంత్రి గుర్తుచేశారు. మార్కెట్ విధానాలను ఇలా అకస్మాత్తుగా మార్చేస్తే తీవ్రంగా నష్టపోయేది రైతేనని స్పష్టం చేశారు.

తెలంగాణ చొరవ - కేంద్రం వైఖరి: రాష్ట్రంలో సుమారు 3.20 లక్షల ఎకరాల్లో 88 వేలకుపైగా రైతులు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని, దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందని తెలిపారు. రైతులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి రాయితీలు, డ్రిప్ ఇరిగేషన్, ప్రాసెసింగ్ యూనిట్లు వంటి అనేక చర్యలు చేస్తుంటే.. కేంద్రం దిగుమతి సుంకం తగ్గించడం ఆ ప్రయత్నాలకు ప్రతికూలంగా మారుతోందన్నారు.

కేంద్రానికి మంత్రి తుమ్మల డిమాండ్లు:

దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే పునఃసమీక్షించాలి.

దేశీయ ఆయిల్ పామ్ రైతులకు పూర్తి రక్షణ కల్పించేలా స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలి.

ఆయిల్ పామ్ గెలలకు (FFB) టన్నుకు రూ. 25,000 కనీస హామీ ధర కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి.

దేశీయ రైతు నిలబడితేనే దేశం నిలబడుతుందని, రైతు ప్రయోజనాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

Clip Adjustments