పండుగల వేళ గ్రామంలో ముమ్మరంగా పారిశుధ్య పనులు, లైట్ల మరమ్మతులు సర్పంచ్ సౌమ్య మహేష్ ఆధ్వర్యంలో బూరుగుపల్లిలో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్

పండుగల వేళ గ్రామంలో ముమ్మరంగా పారిశుధ్య పనులు, లైట్ల మరమ్మతులు
సర్పంచ్ సౌమ్య మహేష్ ఆధ్వర్యంలో బూరుగుపల్లిలో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్
దసరా, బతుకమ్మ పండుగల వేళ .. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి
సర్పంచ్ సౌమ్య మహేష్ ఆధ్వర్యంలో హైమాస్ట్ లైట్ల మరమ్మతులు.. బ్లీచింగ్ పిచికారీ
సిరిసిల్ల (తెలంగాణ అడ్డా - బోయినిపల్లి ప్రతినిధి ):
తెలంగాణ సంస్కృతికి ప్రతీకలైన దసరా, బతుకమ్మ పండుగల పర్వదినాలను పురస్కరించుకుని బోయినిపల్లి మండలంలోని బూరుగుపల్లి గ్రామం ముస్తాబవుతోంది. గ్రామ సర్పంచ్ సౌమ్య మహేష్ ప్రత్యేక చొరవతో గ్రామంలో మౌలిక వసతుల కల్పన, పారిశుధ్య పనులను వేగవంతం చేశారు.
పండుగల వేళ ప్రజలు, మహిళలు రాత్రి సమయాల్లో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు గ్రామంలోని ప్రధాన కూడళ్లలోని హైమాస్ట్ లైట్లతో పాటు అన్ని వార్డుల్లోని వీధి దీపాలకు ప్రత్యేకంగా మరమ్మతులు చేయించి వెలిగించారు. అదే విధంగా గ్రామ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా పంచాయతీ సిబ్బందితో రహదారులకు ఇరువైపులా పెరిగిన పిచ్చిమొక్కలు, గడ్డిని తొలగించి శుభ్రం చేయించారు. వర్షాకాలం దృష్ట్యా దోమల వ్యాప్తి, అంటువ్యాధులు ప్రబలకుండా డ్రైనేజీ (మోరీ)ల వెంబడి ముమ్మరంగా బ్లీచింగ్ పౌడర్ చల్లించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ సౌమ్య మహేష్ మాట్లాడుతూ.. గ్రామ ప్రజలంతా దసరా, బతుకమ్మ పండుగలను సురక్షితమైన, పరిశుభ్రమైన వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలనే ఉద్దేశంతోనే ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతకు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు