విబేధాలు వీడి సమన్వయంతో పనిచేయాలి.. ఆర్భాటపు పనులొద్దు: మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:
గ్రామాల అభివృద్ధి కోసం రాజకీయ విభేదాలను పక్కనపెట్టి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు. గ్రామాల అభివృద్ధే సర్పంచుల ప్రధాన లక్ష్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. తిమ్మాపూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజీవ్ మల్హోత్ర అధ్యక్షతన శనివారం నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు.
ఆర్థిక భారం పడేలా ఆర్భాటాలు వద్దు: పంచాయతీల పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టే ముందు ఆయా పంచాయతీల ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కేవలం హంగులు, ఆర్భాటాల కోసం పనులు చేపట్టి భవిష్యత్తులో కొత్తగా బాధ్యతలు చేపట్టిన సర్పంచులకు ఆర్థిక భారం మోపేలా చేయవద్దని, ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే పనులకే ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.
పాఠశాలలపై ప్రత్యేక దృష్టి: రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా తొలి విడతలో మానకొండూర్ నియోజకవర్గానికి మంజూరైన 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్'ను తిమ్మాపూర్ మండల పరిధిలోని యాదవులపల్లిలో వచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. సర్పంచులు తరచూ ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి మౌలిక వసతులు, విద్యార్థుల సమస్యలపై ఆరా తీయాలని కోరారు.
గ్రామ పారిశుధ్యం - సిబ్బంది పర్యవేక్షణ: గ్రామ పంచాయతీ సిబ్బంది పనితీరును సర్పంచులు నిరంతరం పర్యవేక్షించాలని, గ్రామాలు చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉండేలా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని ఆదేశించారు.
45 మందికి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ:
సమావేశానంతరం తిమ్మాపూర్ మండలంలోని అల్గునూరు, కొత్తపల్లి, మల్లాపూర్, మన్నెంపల్లి, మొగిలిపాలెం, నల్లగొండ, నేదునూరు, నుస్తులాపూర్, పర్లపల్లి, పోలంపల్లి, పోరండ్ల, రేణికుంట, తిమ్మాపూర్, వచ్చునూరు గ్రామాలకు చెందిన 45 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అందజేశారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కర్ర శ్రీనివాస్ రెడ్డి, ఎంఈవో శ్రీనివాస్, ఏపీఎం సంపత్, పంచాయతీరాజ్ ఏఈ స్నేహజ్యోతి, ట్రాన్స్కో ఏఈ ఖాసీం, నుస్తులాపూర్ ప్యాక్స్ చైర్మన్ గోపు మల్లారెడ్డితో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.
ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.