Back to Home
Watermark
శనివారం, 26 సెప్టెంబర్, 2026 TIME : 07:13 PM

సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలి: మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్

Main Image

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి / తెలంగాణ అడ్డా:

ఈ నెల 30వ తేదీన బుధవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనల నిమిత్తం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి రానున్న నేపథ్యంలో, అధికారులు అందరూ సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని వ్యవసాయ, చేనేత జౌళి శాఖ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.

సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శనివారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంత్రులకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలకగా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సమావేశంలో జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తదితరులు పాల్గొన్నారు.

పబ్లిక్ మీటింగ్ మరియు ఏర్పాట్లు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు, సిరిసిల్ల రగుడు బైపాస్ రోడ్ వద్ద ఉన్న మైదానంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు.

భద్రతా చర్యలు - అధికారుల బాధ్యత: పోలీస్ అధికారులు ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు, భద్రతా చర్యలను ముందస్తు ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని సూచించారు. జిల్లా అభివృద్ధిలో అధికారులు భాగస్వామ్యులై, ప్రజలు చిరకాలం గుర్తుంచుకునేలా తమ సేవలు అందించాలని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ మరియు ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Clip Adjustments