జిల్లాస్థాయి సైన్స్ సెమినార్ పోటీలలో ప్రతిభ చాటిన అల్ఫోర్స్ విద్యార్థిని.. రాష్ట్రస్థాయికి ఎంపిక!

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:
విద్యార్థులు తప్పనిసరిగా వివిధ రకాల పోటీ పరీక్షలలో పాల్గొని తమ ప్రతిభను చాటాలని, తద్వారా వారికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్‌కు చెందిన విద్యార్థిని జిల్లాస్థాయి సైన్స్ సెమినార్‌లో ప్రథమ స్థానం సాధించిన సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
పాఠశాల స్థాయిలో విద్యార్థులకు అన్ని విషయాలపై సమగ్ర పరిజ్ఞానం అందిస్తున్నామని, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల ద్వారా వివిధ స్థాయిలలో శిక్షణ ఇప్పిస్తూ అగ్రగామిగా నిలుపుతున్నామని తెలిపారు.
ఇటీవల కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సైన్స్ మ్యూజియంలో నిర్వహించిన జిల్లాస్థాయి సెమినార్ పోటీలలో పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని నిత్యమహి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
జిల్లాస్థాయిలో ప్రథమ స్థానం సాధించడంతో పాటు, త్వరలో హైదరాబాద్‌లో నిర్వహించబోయే రాష్ట్రస్థాయి పోటీలకు ఆమె అర్హత సాధించడం పట్ల విద్యార్థినిని, గైడ్ టీచర్ దీప్తిని నరేందర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.