Back to Home
Watermark
శనివారం, 26 సెప్టెంబర్, 2026 TIME : 07:56 PM

ఓటు హక్కుపై రాజీ లేదు.. ఎన్నికల సంఘంపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించాలి: మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్

Main Image

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా:

ఓటు హక్కు, ఎన్నికల పారదర్శకత, ప్రజాస్వామ్య పరిరక్షణకు సంబంధించిన కీలక అంశాలపై హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన్ భవన్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీపీఐ, సీపీఎం పార్టీల వామపక్షాలు, బీఆర్ఎస్, కాంగ్రెస్, టీజేఎస్ నాయకులు, మేధావులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొని ప్రస్తుత Special Intensive Revision (SIR) ప్రక్రియపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ సంస్థపై ప్రజలకు, రాజకీయ పార్టీలకు సంపూర్ణ విశ్వాసం ఉండటం ప్రజాస్వామ్యానికి అత్యంత అవసరమని అన్నారు.

ఈసీఐలో డిసెంట్ నోట్స్ (Dissent Notes) తీవ్రమైన విషయం: ఎన్నికల సంఘంలోని ఇద్దరు ఎన్నికల కమిషనర్లు — సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి — గత పది నెలల్లో పలు సందర్భాల్లో అధికారికంగా అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' వెలువరిచిన నేపథ్యంలో, ఆ అభ్యంతరాలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల పేర్ల తొలగింపు, ఎలక్టోరల్ రోల్ డేటాబేస్‌కు ప్రాప్యత వంటి అంశాలపై కమిషనర్లు ప్రశ్నలు లేవనెత్తినట్లు పేర్కొన్నారు.

ఎస్‌ఐఆర్ పేరుతో ఒక్క అర్హుడైన ఓటరూ నష్టపోకూడదు: ఎస్‌ఐఆర్ ఉద్దేశం ఓటర్ల జాబితాను శుద్ధి చేయడం అయినప్పటికీ, ఆ ప్రక్రియలో అర్హులైన ఒక్క ఓటరు కూడా తన ఓటు హక్కును కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని వినోద్ కుమార్ అన్నారు. ఓటర్ల జాబితాకు సంబంధించి పూర్తి పారదర్శకత ఉండాలని డిమాండ్ చేశారు.

పశ్చిమ బెంగాల్ పరిణామాలపై స్పష్టత: పశ్చిమ బెంగాల్‌లో ఎస్‌ఐఆర్‌కు సంబంధించి అప్పీల్స్ ప్రక్రియపై ఎన్నికల కమిషన్‌లోనే ప్రశ్నలు తలెత్తినట్లు వచ్చిన నివేదికలను ప్రస్తావిస్తూ.. ఈ అంశాలపై అన్ని రాజకీయ పార్టీలకు పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని స్పష్టం చేశారు.

ఎన్నికల సంఘంపై ప్రజల విశ్వాసం సడలకుండా SIR ప్రక్రియపై పూర్తి పారదర్శకత పాటించాలని, ఓటు హక్కును, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు అందరూ ఐక్యంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.

Clip Adjustments