కరీంనగర్‌లో కుటుంబ కలహాలు.. భర్త అక్రమ సంబంధం గుట్టు రట్టు చేయడంతో ఇరువర్గాల మధ్య భీభత్సమైన ఘర్షణ!

కరీంనగర్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా:
కరీంనగర్ జిల్లాలో కుటుంబ కలహాలు తీవ్ర రూపం దాల్చాయి. భర్త అక్రమ సంబంధాన్ని భార్య గుట్టు రట్టు చేయడంతో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ హనుమాన్ నగర్‌లో తీవ్ర భీభత్సాన్ని సృష్టించింది.
ఘటన వివరాలు: కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఆరెపల్లికి చెందిన రాజు, లావణ్య దంపతుల మధ్య కొద్దిరోజులుగా కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. సుమారు రెండు నెలల క్రితం భర్త రాజు అక్రమ సంబంధాన్ని భార్య లావణ్య గుట్టు రట్టు చేయడంతో వీరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి.
భర్త వేధింపులు: ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని రాజు తన భార్యను తరచూ కొట్టేవాడని స్థానికులు చెబుతున్నారు. భర్త టార్చర్ భరించలేక లావణ్య తన పుట్టింటికి వెళ్లిపోగా.. మంచిగా చూసుకుంటానని నమ్మించి కొద్ది రోజుల క్రితం రాజు ఆమెను తిరిగి ఇంటికి తీసుకువచ్చాడు.
ఇరువర్గాల మధ్య దాడులు: అయితే భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో లావణ్య మళ్లీ తల్లిగారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పింది. ఈ నేపథ్యంలో మాట్లాడదామని ఇరువర్గాలు కరీంనగర్‌లోని హనుమాన్ నగర్‌కు చేరుకోగా, అక్కడ రాజు కుటుంబ సభ్యులు, భార్య కుటుంబ సభ్యులపై కట్టెలతో దాడి చేసినట్లు తెలుస్తోంది.
కర్రలు, బండరాళ్లతో ఘర్షణ: ఇరువర్గాలు కర్రలు, బండరాళ్లతో ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి చేసుకోవడంతో హనుమాన్ నగర్ ప్రాంతంలో తీవ్ర భయాందోళన వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ ఘటనపై పోలీసులను వివరణ కోరగా.. ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని వారు పేర్కొన్నారు.