కొంగరకుర్దు భూముల కబ్జాపై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలదే భూమాఫియా

రంగారెడ్డి జిల్లా బ్యూరో / తెలంగాణ అడ్డ
రంగారెడ్డి జిల్లా కొంగరకుర్దు-ఏ గ్రామ భూ బాధితులతో కలిసి తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు కలిసి రూ. 5 వేల కోట్ల విలువైన వక్ఫ్ భూములను కబ్జా చేస్తున్నారని ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొంగరకుర్దు భూములను వెంటనే రక్షించాలని, రైతులకే ఆ భూములు దక్కాలని ఆమె డిమాండ్ చేశారు.
భూ మాఫియా చెరలో 150 ఎకరాల వక్ఫ్ భూమి:
తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఆర్కనైజ్డ్గా భూ మాఫియా పెద్ద ఎత్తున భూములు కబ్జా చేస్తోందని కవిత ఆరోపించారు. కొంగరకుర్దులోని సర్వే నంబర్లు 2 నుంచి 400 వరకు ఉన్న 580 ఎకరాల భూమి వక్ఫ్ బోర్డుకు చెందుతుందని, 2007లోనే గెజిట్ ఇచ్చి 22ఏ లో చేర్చారని తెలిపారు. అయితే 2022లో ఈ భూములపై మాఫియా కన్ను పడిందని, ఒక రైతు 58 ఎకరాల్లో సాగు చేస్తున్న పంటను మూడు జేసీబీలతో ధ్వంసం చేసి లేఅవుట్లు వేశారని విమర్శించారు. బీహార్, ఉత్తర ప్రదేశ్ కన్నా దారుణంగా రైతుల భూములు లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు.
అధికారులు, పత్రికల తీరుపై విమర్శలు:
కొంగరకుర్దు భూముల కబ్జాపై రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసినా కనీసం కేసులు నమోదు చేయడం లేదని మండిపడ్డారు. సంబంధం లేని వారి పేర్లతో ఓఆర్సీలు సృష్టించి, కోర్టుల్లో కేసులు వేసి అనుకూలంగా తీర్పులు తెచ్చుకుని రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారని ఆరోపించారు. అర్బన్ క్రెస్ట్, సిటీ గ్రాండ్ ఎన్క్యూ వెంచర్స్ సంస్థలు ఇక్కడ భారీ వెంచర్లు వేశాయని, 2022 తర్వాత ఇక్కడ జరిగిన అన్ని రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వెంచర్లు ఇకపై ఒక్క గజం భూమిలో ఎక్స్టెండ్ చేసినా రంగారెడ్డి కలెక్టర్ ను, ప్రభుత్వాన్ని కోర్టుకు లాగుతామని హెచ్చరించారు.
మీడియా కథనాలు, బీఆర్ఎస్ పాత్రపై సవాల్:
నమస్తే తెలంగాణ, సాక్షి పత్రికల్లో ఈ భూమాఫియాపై మొదట వార్తలు వచ్చినా, ఆ తర్వాత ఒత్తిళ్లతో వాటిని మార్చేశారని కవిత ఆరోపించారు. నమస్తే తెలంగాణలో ఒక్క రోజు వార్త రాసి ఒక ప్రముఖ బీఆర్ఎస్ నేత వెనుక ఉండటంతో మళ్లీ రాయలేదని, సాక్షిలో ముందు రోజు మాఫియాకు వ్యతిరేకంగా వచ్చి తెల్లారే రైతులకు వ్యతిరేకంగా స్టోరీ రాశారని పేర్కొన్నారు. బాలమయా దేవి అనే ఐఏఎస్ ఆఫీసర్ తన సంతకాలు ఫోర్జరీ చేశారని లేఖ రాసినా ఎందుకు కాంప్రమైజ్ అయ్యారని బీఆర్ఎస్ పార్టీని ఆమె ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో కొన్ని ఇండ్లే బంగారం అయ్యాయని చెప్పడానికి ఈ కొంగరకుర్దు భూములే సాక్ష్యమని స్పష్టం చేశారు.