కరీంనగర్ కైవసం కాంగ్రెస్‌కు సాధ్యమేనా? లక్ష మైనారిటీ ఓట్లు ఉన్నా బలహీనపడుతున్న క్యాడర్!

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ:
రాబోయే రోజుల్లో కరీంనగర్ సీటుతో పాటు సిరిసిల్ల సీటును కూడా కైవసం చేసుకుంటామని చొప్పదండి ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మేడిపల్లి సత్యం ధీమా వ్యక్తం చేయడంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితులు, సమీకరణాలను పరిశీలిస్తే ఈ ప్రకటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కరీంనగర్ నియోజకవర్గంలో గణనీయమైన సంఖ్యలో ఉన్న మైనారిటీ ఓటు బ్యాంక్ మరియు పార్టీలో వారి ప్రాతినిధ్యంపై ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
లక్ష మైనారిటీ ఓట్లు.. బలహీనపడుతున్న క్యాడర్:
కరీంనగర్ గడ్డపై మైనారిటీ వర్గానికి చెందిన ఓట్లు దాదాపు లక్ష వరకు ఉన్నట్లు అంచనా. ఎన్నికల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేయడంలో ఈ ఓట్ల పాత్ర కీలకం. అయితే, గత బీఆర్ఎస్ హయాంలో మైనారిటీ నాయకులకు నామినేటెడ్ పదవులు, కీలక పోస్టులు వంటి ప్రాతినిధ్యం పెద్ద ఎత్తున దక్కిందనే భావన ఆ వర్గంలో ఉంది. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో తమకు తగిన ప్రాధాన్యం దక్కలేదని, కనీస నామినేటెడ్ లేదా ప్రత్యేక పోస్టుల కేటాయింపులోనూ తమను విస్మరిస్తున్నారనే అసంతృప్తి మైనారిటీ నాయకుల్లో బలంగా వ్యక్తమవుతోంది.
ప్రశ్నార్థకంగా మారుతున్న కాంగ్రెస్ గెలుపు వ్యూహం:
స్థానిక సంస్థలు మరియు ఇతర పదవుల కేటాయింపుల్లో తమకు తగిన న్యాయం జరగకపోవడంతో మైనారిటీ క్యాడర్ లోలోపల అసంతృప్తితో ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో పార్టీ కేవలం ప్రకటనలకే పరిమితమైతే కరీంనగర్ సీటును దక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీని నమ్ముకున్న మైనారిటీ నాయకులకు తగిన గుర్తింపునిచ్చి, ప్రభుత్వ పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తేనే క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టమవుతుందని పార్టీ శ్రేణులు కూడా అభిప్రాయపడుతున్నాయి.
మైనారిటీలకు భరోసా కల్పిస్తుందా?
సొంత గడ్డపై పట్టు సాధించాలంటే అన్ని వర్గాలను కలుపుకొనిపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ హైకమాండ్ మరియు జిల్లా నాయతృత్వం స్పందించి, మైనారిటీలకు తగిన ప్రాధాన్యం కల్పించే దిశగా, వారికి పదవులు కేటాయించే దిశగా ఏమైనా చర్యలు తీసుకుంటుందా? లేదా కేవలం ప్రకటనలకే పరిమితమవుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.