కాళేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో డీఐజీ అంబర్ కిషోర్ ఝా ఆకస్మిక తనిఖీ.. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశం

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ:
కాళేశ్వరం పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం కాళేశ్వరం జోన్-I డీఐజీ అంబర్ కిషోర్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్ పరిసరాలను పరిశీలించి, అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులు మరియు సిబ్బంది పనితీరును సమీక్షించారు. అలాగే పోలీస్‌స్టేషన్‌కు సంబంధించిన వివిధ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ తనిఖీలో భాగంగా ఎస్‌ఐ, స్టేషన్ రైటర్, సీసీటీఎన్‌ఎస్ రైటర్లతో మాట్లాడిన డీఐజీ.. ఆన్‌లైన్ వివరాల నమోదు, రికార్డుల అప్‌లోడ్ ప్రక్రియపై ఆరా తీశారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో తరచుగా నమోదయ్యే నేరాలు, గ్రామాల పరిస్థితి, శాంతిభద్రతల తీరు తెన్నులు, స్టేషన్ నిర్వహణ తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రజలతో మర్యాదపూర్వకంగా ఉండాలి:
పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, బాధితులు మరియు ప్రజలకు అందించే సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు.
రౌడీషీటర్లపై నిరంతరం నిఘా:
రౌడీషీటర్లు, సస్పెక్ట్‌షీట్లో ఉన్న వ్యక్తుల ఇళ్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని, వారి కదలికలు మరియు కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు.
సరిహద్దు ప్రాంతం కావడంతో అప్రమత్తత అవసరం:
ప్రజల భద్రతకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించిన డీఐజీ.. ఇది రాష్ట్ర సరిహద్దు పోలీస్‌స్టేషన్ కావడంతో సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.