Back to Home
Watermark
మంగళవారం, 29 సెప్టెంబర్, 2026 TIME : 08:53 PM

తుమ్మిడిహట్టి బ్యారేజీకి త్వరగా అనుమతులు ఇప్పించండి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి

Main Image

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ

ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ సీఆర్ పాటిల్‌తో సమావేశమయ్యారు. మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కలిసి కేంద్ర మంత్రితో భేటీ అయిన ముఖ్యమంత్రి.. కృష్ణా, గోదావరి బేసిన్లలో తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి త్వరగా అనుమతులు మంజూరయ్యేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

తుమ్మిడిహట్టి బ్యారేజీతో భారీగా తగ్గనున్న విద్యుత్ వ్యయం:

తుమ్మిడిహట్టి బ్యారేజీని ఎఫ్‌ఆర్‌ఎల్‌ (FRL) +152 మీటర్ల స్థాయిలో నిర్మించేందుకు తెలంగాణ, మహారాష్ట్ర మధ్య త్వరగా అంగీకారం కుదిరేలా చూడాలని సీఎం కోరారు. ఆ స్థాయిలో బ్యారేజీ నిర్మిస్తే గ్రావిటీ ఆధారంగా నీటిని ఎల్లంపల్లికి తరలించేందుకు వీలుంటుందని, తద్వారా నీటి తరలింపునకు అవసరమయ్యే విద్యుత్తు వినియోగం, భారీ విద్యుత్ వ్యయం గణనీయంగా తగ్గుతుందని వివరించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మహారాష్ట్ర కోరిన సమాచారాన్ని ఇప్పటికే సమర్పించినట్లు కేంద్ర మంత్రికి తెలిపారు.

పెండింగ్ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలి:

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (PRLIS), డిండి ఎత్తిపోతల పథకం (DLIS), సీతారామ సాగర్ బహుళార్ధక ప్రాజెక్టు (SSMP), మరియు గౌరవెల్లి రిజర్వాయర్‌‌కు వెంటనే పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని సీఎం కోరారు. ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పర్యావరణ అనుమతులకు మార్గదర్శకాలను జారీ చేస్తామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో, అనుమతుల్లో జాప్యం జరిగితే ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం విపరీతంగా పెరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

సమ్మక్కసాగర్, టెలీమెట్రీ అంశాలపై చర్చ:

సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జల సంఘం (CWC) వద్ద పెండింగ్‌లో ఉన్న డీపీఆర్ అనుమతులను త్వరగా క్లియర్ చేయాలని కోరారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నుంచి నిరభ్యంతర పత్రం (NOC) పొందేందుకు తాము చర్చలు జరుపుతున్నామని తెలిపారు. అలాగే, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) ఆధ్వర్యంలో చేపట్టాల్సిన టెలీమెట్రీ యంత్రాల ఏర్పాటును వేగవంతం చేయాలని కోరారు. మొదటి దశ టెలీమెట్రీ యంత్రాల ఏర్పాటుకు అవసరమైన రూ. 4.15 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే జమ చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ, రెండు మరియు మూడో దశల యంత్రాలను కూడా త్వరగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రి జి. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నీటిపారుదల) ఆదిత్యనాధ్ దాస్, సీఎం సెక్రటరీ మాణిక్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Clip Adjustments