ప్రజారోగ్య సమస్యలపై తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం పోస్టర్ ఆవిష్కరించిన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ
కరీంనగర్ జిల్లాలో ప్రజారోగ్య సమస్యలపై తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ఈనెల అక్టోబర్ 6న నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించిన వాల్ పోస్టర్ను తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించడంతో పాటు, వైద్యులు, నర్సులు మరియు ఇతర సిబ్బంది ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అత్యవసర వైద్యం 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైన మందులు, వైద్య పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రులలో నిరంతరం లభించాలని కోరారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులలో పారిశుద్ధ్యం, తాగునీరు, మరుగుదొడ్లు, రోగుల బంధువులకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.
ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలి:
ప్రైవేట్ ఆసుపత్రులలో అనవసర పరీక్షల పేరుతో వసూలు చేస్తున్న అధిక బిల్లులపై కఠినమైన నియంత్రణ ఉండాలని, చికిత్సకు సంబంధించిన ఫీజులు, ఖర్చుల్లో పూర్తి పారదర్శకత తీసుకురావాలని కవిత అన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రులపై వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లా స్థాయిలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. వైద్యం అనేది వ్యాపారం కాదని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అనే అంశాన్ని విస్మరించకూడదన్నారు.
అక్టోబర్ 6న రౌండ్ టేబుల్ సమావేశం:
ప్రజారోగ్య రంగానికి సంబంధించిన సమస్యలు మరియు వాటి పరిష్కార మార్గాలపై చర్చించేందుకు కరీంనగర్లో ఈనెల 6వ తేదీన (అక్టోబర్ 6న) ఉదయం 11 గంటలకు మంచిర్యాల చౌరస్తా వద్ద గల హోటల్ మహతిలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలంగాణ రక్షణ సేన నాయకులు తెలిపారు. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, తెలంగాణ ఉద్యమకారులు, ఆరోగ్య నిపుణులు, సామాజిక ఆలోచనా సంఘాలు మరియు అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జ్ లింగంపల్లి నాగరాజు, కరీంనగర్ అసెంబ్లీ ఇంచార్జ్ అంకం శివరాణి, మానకొండూర్ ఇంచార్జ్ చెన్నమల్ల చైతన్య, హుజూరాబాద్ ఇంచార్జ్ సంతోష్ యాదవ్, చొప్పదండి నియోజకవర్గం నాయకులు మ్యాకల తిరుపతి, జిల్లా మహిళా అధ్యక్షురాలు పిన్నింటి సంగీత రెడ్డి, నగర పార్టీ అధ్యక్షుడు రంగరవేణి లక్ష్మణ్, బుడిగె పర్షారం గౌడ్, బసవేణి రాజేందర్, కుతాడి శ్రీనివాస్, చండి శ్రీనివాస్, మ్యాక వినోద్, ఎం.డి. సల్మా, వంగల పవన్, కేతిరెడ్డి జయపాల్, డిటి సరిష రమేష్ తదితరులు పాల్గొన్నారు.