జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ కోసం గాంధీ విగ్రహం వద్ద నిరసన కలెక్టర్ చిత్ర మిశ్రకు వినతిపత్రం అందజేత

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ:
జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) కరీంనగర్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గాండ్ల శ్రీనివాస్, కొయ్యడ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) పిలుపు మేరకు గాంధీ జయంతి సందర్భంగా కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టులు శాంతియుతంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రను కలిసి, తమ ప్రధాన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా గాండ్ల శ్రీనివాస్, కొయ్యడ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. బెంగళూరులో జరిగిన ఐజేయూ కార్యవర్గ సమావేశంలో దేశవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రధాన డిమాండ్లు:
మీడియా రంగానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి వెంటనే నూతన మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి.
మీడియా సిబ్బందికి పూర్తి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి.
జర్నలిస్టుల వేతనాలు, ఉద్యోగ భద్రత కోసం నూతన వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలి.
జర్నలిస్టులకు నిలిపివేసిన రైల్వే పాస్‌లను పునరుద్ధరించాలి.
పత్రికా స్వేచ్ఛను పరిరక్షించడంతో పాటు మీడియా కార్మికుల సామాజిక, ఆర్థిక భద్రతకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.
రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన అంశాలు:
తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తున్న తరహాలో హెల్త్ కార్డులు మంజూరు చేసి క్యాష్‌లెస్ వైద్య చికిత్స అందించాలని టీయూడబ్ల్యూజే నాయకులు విజ్ఞప్తి చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎలగందుల రవీందర్, జిల్లా ఉపాధ్యక్షులు గాండ్ల సంపత్, ఎం.డి. షుకూర్, సంయుక్త కార్యదర్శి దాడి సంపత్, కోశాధికారి గాజుల వెంకటేష్, ఎలక్ట్రానిక్ మీడియా కార్యదర్శి యూ. రవీందర్, సీనియర్ నాయకులు కే. విజయందర్ రెడ్డి, అనుబంధ కమిటీల రాష్ట్ర నాయకులు, జిల్లా కార్యవర్గ సభ్యులు జన్నారం శ్రీనివాస్, కే. గంగరాజు, ఎలిగేటి శ్రీనివాస్‌లతో పాటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.