Back to Home
Watermark
ఆదివారం, 04 అక్టోబర్, 2026 TIME : 06:38 PM

రాష్ట్రంలో తీవ్ర కరువు సీఎం అచేతన స్థితిలో ఉన్నారు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

Main Image

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ

బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నా ముఖ్యమంత్రి అచేతన స్థితిలో ఉన్నారని ధ్వజమెత్తారు. కరువును ఎదుర్కోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, వరుణయాగం చేసి ప్రజల ఖర్మ అన్నట్లుగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని విమర్శించారు.

ఈ మీడియా సమావేశంలో ఆమె లేవనెత్తిన ప్రధానాంశాలు క్రింది విధంగా ఉన్నాయి:

తీవ్ర కరువులో రాష్ట్రం.. వెంటనే ప్రత్యేక కేబినెట్ సమావేశం కావాలి:

రాష్ట్రవ్యాప్తంగా కరువు తాండవిస్తోందని, భూగర్భ జలాలు కొన్ని చోట్లలో 20 మీటర్ల లోతుకు పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. చాలా చోట్ల రైతన్నలు పంటలు ఎండిపోయి కళ్ల ముందే కాల్చుకుంటున్న పరిస్థితి చూస్తున్నామన్నారు. జూలైలో 1 శాతం, ఆగస్టులో 38 శాతం, సెప్టెంబర్‌లో 30 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని గుర్తుచేశారు. ఈ ఏడాది సూపర్ ఎల్ నినో ఉంటుందని సైంటిస్టులు ముందే హెచ్చరించినా, ప్రభుత్వం కనీస సమీక్ష కూడా చేయలేదని విమర్శించారు. రైతులను, పంటలను ఆదుకునేందుకు తక్షణమే ప్రత్యేక కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

నవంబర్ వరకు 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వాల్సిందే:

రాష్ట్రంలో ఇప్పటికీ కోటి 20 లక్షల ఎకరాల పంట ఉందని, నవంబర్ వరకు ఆ పంటలకు సంపూర్ణంగా కరెంట్ ఇస్తేనే అవి బతుకుతాయని కవిత స్పష్టం చేశారు. కరెంట్ ఉంటేనే బోర్ల ద్వారా రైతులు పంటలను కాపాడుకోగలరని, కానీ రాష్ట్రంలో ఏ ఊళ్లోనూ 6 నుంచి 7 గంటలు కూడా కరెంట్ రావట్లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి సొంతూరు కొండారెడ్డిపల్లిలో కూడా 7 గంటల కరెంట్ రావట్లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం అడుక్కుంటుందో, కొనుక్కుంటుందో మాకు తెలియదని, నవంబర్ వరకు రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పారు.

కరువు మండలాలను ఎందుకు ప్రకటించడం లేదు?:

మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ రాష్ట్రాలు ఇప్పటికే కరువు మండలాలను ప్రకటించాయని, మన ప్రభుత్వం మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నారు. కరువు మండలాలను ప్రకటిస్తే కేంద్రం నుంచి సాయం అందే అవకాశం ఉంటుందని, కానీ ఈ ప్రభుత్వం కరువు ఉందని చెప్పేందుకే భయపడుతోందని విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాలను ఆదుకోవాలని ప్రధాని మోడీని కోరిన ఆమె, ఈ సమయంలో కేంద్రం కూడా ఆదుకోకపోతే ప్రజలు క్షమించరని అన్నారు.

ప్రజా సమస్యలపై పోరాటం.. ఈవీఎంల స్థానంలో పేపర్ బ్యాలెట్ రావాలి:

రాష్ట్రంలో తాగునీటి సమస్య కూడా తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రైతుల సమస్యలను ప్రభుత్వానికి తెలిపేందుకు పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్‌లు ప్రతి గ్రామానికి వెళ్తారని తెలిపారు. హాస్పిటల్స్‌లో పరిస్థితులపై 'ఆపరేషన్ బ్లూ కోడ్' పేరుతో పార్టీ నాయకులు పరిశీలన జరుపుతున్నారని, రిమ్స్ మరియు భూపాలపల్లి హాస్పిటల్ ఘటనలపై పోరాడితేనే ప్రభుత్వం స్పందించిందని గుర్తుచేశారు. 317 జీవో బాధితులను ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని, గాంధీ జయంతి రోజు శాంతియుతంగా ఆందోళన చేస్తున్న టీచర్లపై లాఠీచార్జ్ చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు ఈవీఎంలను రద్దు చేసి, మళ్లీ పేపర్ బ్యాలెట్ విధానాన్ని తీసుకొచ్చే వరకు పోరాటం చేస్తామని కవిత స్పష్టం చేశారు.

Clip Adjustments