తెలంగాణలో నకిలీ ఓటర్ దరఖాస్తులపై ఎన్నికల సంఘం సీరియస్.. తప్పుడు వివరాలిచ్చిన వారిపై క్రిమినల్ చర్యలకు ఆదేశం!

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ:
రాష్ట్రంలో ఎస్ఐఆర్ (SIR-2026) ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా పెద్ద సంఖ్యలో వస్తున్న నకిలీ దరఖాస్తులపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ఓటరు జాబితా నుంచి పేర్లను తొలగించేందుకు లేదా అక్రమంగా మార్పులు చేసేందుకు భారీగా వస్తున్న 'ఫారమ్-7' (Form-7) నకిలీ దరఖాస్తులను గుర్తించిన ఈసీ, తప్పుడు వివరాలు సమర్పించి మోసానికి పాల్పడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేసింది.
భారీగా ఫారమ్-7 నకిలీ దరఖాస్తుల గుర్తింపు:
రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితా పరిశీలన సమయంలో కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారంతో పెద్ద ఎత్తున ఫారమ్-7 దరఖాస్తులను దాఖలు చేసినట్లు ఎన్నికల సంఘం విచారణలో తేలింది. ఎలాంటి సరైన ఆధారాలు లేకుండా, ఇతరుల పేర్లను తొలగించే లక్ష్యంతో నకిలీ దరఖాస్తులు ఇస్తున్నట్లు గుర్తించి దీనిపై ఆరా తీసింది.
సెక్షన్ 31 కింద కఠిన చర్యలు:
తప్పుడు వివరాలతో నకిలీ దరఖాస్తులు సమర్పించిన వారిపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరపాలని, ప్రజా ప్రాతినిధ్య చట్టం (Representation of the People Act) సెక్షన్ 31 కింద వారిపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.
అధికారులకు, రాజకీయ పార్టీలకు ఈసీ స్పష్టమైన ఆదేశాలు:
ఈ నకిలీ దరఖాస్తుల వ్యవహారంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO), జిల్లా కలెక్టర్లు, డీఈవోలు (DEOs) మరియు ఈఆర్వోలకు (EROs) ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. పారదర్శకతను దెబ్బతీసే ఇలాంటి అక్రమ చర్యలపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేస్తూ, ఈ ఉత్తర్వుల కాపీలను రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు కూడా పంపినట్లు ఈసీ వెల్లడించింది.