సిద్దిపేటలో త్వరలోనే భారీ బహిరంగ సభ, పార్టీ కార్యాలయం తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ
సిద్దిపేట పట్టణంలోని శివాజీ నగర్‌లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వ్యక్తిగత కార్యదర్శి (PA) వెంకటనారాయణను తెలంగాణ రక్షణ సేన చీఫ్ శ్రీమతి కల్వకుంట్ల కవిత మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వెంకటనారాయణను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ సిద్దిపేట రాజకీయాలపై కీలక ప్రకటనలు చేశారు.
ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు:
సిద్దిపేట మా సొంతింటి లాంటిది:
"సిద్దిపేట నాకు అమ్మగారి ఇల్లు లాంటిది. ఇక్కడికి నేను ఎప్పుడైనా వస్తుంటాను, వెళ్తుంటాను. వెంకటనారాయణ గారు మా కుటుంబానికి అత్యంత ఆప్తులు," అని కవిత ఆప్యాయంగా గుర్తుచేసుకున్నారు.
భారీ ఎత్తున పార్టీ కార్యక్రమాలు, ఉమ్మడి మెదక్ జిల్లాలో బహిరంగ సభ:
రానున్న రోజుల్లో సిద్దిపేటలో పార్టీ కార్యక్రమాలను భారీ ఎత్తున చేపట్టబోతున్నామని కవిత స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో భారీ మీటింగ్‌లు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే రానున్న రోజుల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని ప్రకటించారు.
సిద్దిపేటలో పార్టీ ఆఫీస్ ఏర్పాటు - బలమైన కార్యాచరణ:
సిద్దిపేటలో త్వరలోనే 'తెలంగాణ రక్షణ సేన' పార్టీ కార్యవిధాసం కోసం ప్రత్యేకంగా పార్టీ ఆఫీస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇక్కడ పెద్ద ఎత్తున క్యాడర్ నిర్మాణం చేపట్టి, ప్రజా సమస్యలపై పోరాడేందుకు ఒక బలమైన కార్యాచరణను అమలు చేస్తామని కవిత తేల్చిచెప్పారు.