Back to Home
Watermark
బుధవారం, 07 అక్టోబర్, 2026 TIME : 08:42 AM

కరీంనగర్, సిద్దిపేటలో కోనోకార్పస్ చెట్లను సమూలంగా తొలగించాలి హైకోర్టు సంచలన ఆదేశాలు

Main Image

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ:

ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్న ప్రమాదకరమైన కోనోకార్పస్ (Conocarpus) చెట్లపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. తీవ్రమైన విషవాయువులను విడుదల చేస్తూ, పర్యావరణానికి, ముఖ్యంగా చిన్న పిల్లలు మరియు వృద్ధుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న ఈ చెట్లను కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లో వెంటనే సమూలంగా తొలగించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రజల పాలిట మరణ శాసనంగా మారిన ఈ కోనోకార్పస్ చెట్ల తొలగింపుపై కోర్టు ఇచ్చిన తీర్పుతో ఉమ్మడి జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతున్న కోనోకార్పస్:

పట్టణాల సుందరీకరణ పేరిట గతంలో విరివిగా నాటిన కోనోకార్పస్ చెట్లు ప్రస్తుతం ప్రజల ఆరోగ్యానికి పెను శాపంగా మారాయి. ఈ చెట్లు విడుదల చేసే హానికరమైన పుప్పొడి రేణువులు మరియు విషవాయువుల వల్ల ప్రజలు తీవ్రమైన శ్వాసకోశ, ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, ఆస్తమా రోగులు శ్వాస తీసుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హైకోర్టు ఆదేశాల అమలుకు అధికారుల కసరత్తు:

ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కరీంనగర్ మరియు సిద్దిపేట పట్టణాలతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోడ్లకు ఇరువైపులా, పార్కుల్లో ఉన్న కోనోకార్పస్ చెట్లన్నింటినీ తక్షణమే తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. కోర్టు ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు త్వరలోనే క్షేత్రస్థాయిలో ఈ చెట్ల తొలగింపు ప్రక్రియను చేపట్టనున్నారు.

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి ప్రమాదకరమైన చెట్లను తొలగించాలన్న హైకోర్టు నిర్ణయం పట్ల పర్యావరణ ప్రేమికులు, పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు రంగంలోకి దిగి నగరంలో ఉన్న ప్రతి కోనోకార్పస్ చెట్టును తొలగించి ప్రజారోగ్యాన్ని కాపాడాలి.

Clip Adjustments