Back to Home
Watermark
బుధవారం, 07 అక్టోబర్, 2026 TIME : 10:45 PM

సైబర్ మోసగాళ్లపై తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్.. ఆరు రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు, 101 మంది అరెస్ట్

Main Image

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ

సైబర్ నేరగాళ్ల ఆట కట్టించేందుకు తెలంగాణ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న సైబర్ మోసాలపై ఉక్కుపాదం మోపుతూ, తెలంగాణ సైబర్ క్రైమ్ బ్యూరో పోలీసులు ఆరు రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ భారీ ఆపరేషన్‌లో మొత్తం 101 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు అధికారికంగా వెల్లడించారు.

​అరెస్టుల వివరాలు:

పట్టుబడిన 101 మందిలో 18 మంది మహిళలు ఉండగా, 83 మంది పురుషులు ఉన్నారు. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ మరియు పుదుచ్చేరి రాష్ట్రాలలో విస్తృతంగా నిర్వహించిన ఈ ఆపరేషన్ ద్వారా దేశవ్యాప్తంగా నమోదైన ఏకంగా 1,172 సైబర్ క్రైమ్ కేసుల్లోని నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

​మ్యూల్ అకౌంట్ల (Mule Accounts) దందా:

ఈ అంతర్రాష్ట్ర సైబర్ ముఠా సభ్యులు ప్రధానంగా సైబర్ నేరగాళ్లకు 'మ్యూల్ అకౌంట్స్' (డబ్బులు జమ చేయడానికి, తరలించడానికి ఉపయోగించే నకిలీ/అక్రమ బ్యాంకు ఖాతాలు) సమకూరుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మోసాల ద్వారా సంపాదించిన అక్రమ సొమ్మును ఈ ఖాతాల ద్వారా దారి మళ్లిస్తున్న ఈ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.

​సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లావాదేవీలు లేదా సైబర్ మోసాలకు గురైతే వెంటనే '1930' టోల్ ఫ్రీ నంబర్‌కు లేదా cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.

Clip Adjustments