‘రాజీవ్‌చౌక్’ విజిలెన్స్ విచారణ డిమాండ్ పై కక్షసాధింపు తగదు ‘తెలంగాణ అడ్డ’ స్పష్టత!

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ
కరీంనగర్ నగరంలోని ‘రాజీవ్‌చౌక్’ పనుల్లో భాగంగా అమర్చిన ఫౌంటెన్ పైపు ఊడిపోయిన ఉదంతంపై మరియు అక్కడ జరిగిన పనుల నాణ్యతపై ప్రజా ప్రయోజనాల దృష్ట్యా 'తెలంగాణ అడ్డ' దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. ప్రజాధనం సద్వినియోగం కావాలనే ఉద్దేశంతో, ఆ పనులపై విజిలెన్స్ అధికారులతో సమగ్ర ఎంక్వైరీ జరిపించాలని మాత్రమే మేము డిమాండ్ చేశాం తప్ప, ఎవరిపైనా నేరుగా వ్యక్తిగత ఆరోపణలు చేయలేదు. మేము వార్త ప్రచురించిన తర్వాతే సంబంధిత అధికారులు స్పందించి ఆ ఊడిపోయిన పైపును తిరిగి పునరుద్ధరించారనేది అక్షర సత్యం.
వాస్తవాలు ఇలా ఉంటే.. పత్రికా విలువలను దెబ్బతీసేలా, నిజాలను తొక్కిపెట్టేలా మాజీ సుడా (SUDA) చైర్మన్ అనుచరుల కరీంనగర్ బ్యూరోపై అక్రమ కేసులు పెట్టించడం తీవ్ర విచారకరం.
విజిలెన్స్ విచారణ అడగడం నేరమా?
రాజీవ్‌చౌక్ వేదికగా గతంలో జరిగిన పనుల తీరుపై, ప్రజాధన వినియోగంపై విజిలెన్స్ విచారణ జరిపించాలని కోరడం పత్రికా రంగం యొక్క బాధ్యత. మేము లేవనెత్తిన సాంకేతిక లోపాలను సరిదిద్దినందుకు సంతోషించాల్సింది పోయి, విజిలెన్స్ విచారణ డిమాండ్‌ను తట్టుకోలేక అనుచరులను ముందుకూపి కేసులు పెట్టించడం ప్రజాస్వామ్య విరుద్ధం.
అనుచరుల ముసుగులో కక్షసాధింపు:
నేరుగా జవాబు చెప్పలేక అనుచరుల ద్వారా ఫిర్యాదులు చేయించి, ఎఫ్ఐఆర్లు నమోదు చేయించడం ద్వారా పత్రికా స్వేచ్ఛపై దాడి చేయాలని చూస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్న జర్నలిస్టుల నోళ్ళు మూయించాలని చూస్తే చట్టపరంగా, ప్రజాక్షేత్రంలో గట్టిగా ఎదుర్కొంటాం.
న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది:
మాజీ సుడా చైర్మన్ మరియు ఆయన అనుచరులు బనాయించిన ఈ అక్రమ కేసులపై మేము చట్టపరిధిలోనే న్యాయపోరాటం చేస్తాం. గౌరవ న్యాయస్థానాలు మరియు విచారణ అధికారుల పట్ల మాకు పూర్తి విశ్వాసం ఉంది. బెదిరింపులకు, కక్షపూరిత కేసులకు 'తెలంగాణ అడ్డ' భయపడేది లేదు. ప్రజా ప్రయోజనాలే పరమావధిగా కరీంనగర్ ప్రజల తరఫున నిష్పక్షపాతంగా వార్తలు రాయడం కొనసాగిస్తూనే ఉంటాం.