Back to Home
Watermark
శనివారం, 10 అక్టోబర్, 2026 TIME : 07:08 PM

అల్ఫోర్స్‌ విద్యాసంస్థల్లో ఘనంగా 'సద్దుల బతుకమ్మ' వేడుకలు. సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ డాక్టర్ వి.నరేందర్ రెడ్డి

Main Image

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ

తెలంగాణ విశిష్ట సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ నిలువెత్తు ప్రతీక అని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి ఉద్ఘాటించారు. స్థానిక వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్ నెక్స్ట్ మైదానంలో 'అల్ఫోర్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ & కాలేజెస్' ఆధ్వర్యంలో 'సద్దుల బతుకమ్మ' ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు డాక్టర్ వి.నరేందర్ రెడ్డి తమ సతీమణి డాక్టర్ వి.వనజా నరేందర్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మైదానంలో దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు.

ఆనందోత్సాహాల మధ్య ఉత్సవాల నిర్వహణ:

ఈ సందర్భంగా డాక్టర్ వి.నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అల్ఫోర్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం బతుకమ్మ ఉత్సవాలను అత్యంత వైభవంగా, సంస్కృతి పరిరక్షణే ధ్యేయంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో చివరి రోజైన 'సద్దుల బతుకమ్మ'కు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ దీనిని పండుగలా జరుపుకుంటారని పేర్కొన్నారు. తరతరాలుగా వస్తున్న ఈ అద్భుతమైన సంప్రదాయాన్ని కాపాడుకుంటూ భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

Additional Image

ప్రత్యేక ఆకర్షణగా విద్యార్థినుల ప్రదర్శనలు:

ఉత్సవాల్లో భాగంగా విద్యార్థినులు రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలతో విచ్చేసి మైదానంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బతుకమ్మ పాటలు, జానపద గేయాలకు అనుగుణంగా విద్యార్థినులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా యువతీ యువకులు, విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా దాండియా ఆడుతూ వేడుకల్లో సంతోషంగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో అల్ఫోర్స్ వివిధ పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, అధ్యాపక బృందం, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని సద్దుల బతుకమ్మ వేడుకలను దిగ్విజయం చేశారు.

Clip Adjustments