రైతు పట్ల నిర్దయగా ప్రవర్తించిన గజ్వేల్ తహశీల్దార్ స్వామి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసిన సిద్దిపేట కలెక్టర్ హైమావతి!

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ
సిద్దిపేట / గజ్వేల్
వ్యవసాయ భూమి, జీవనోపాధి సమస్యపై న్యాయం కోసం ఆఫీసు చుట్టూ తిరుగుతున్న ఒక బాధిత రైతు పట్ల అత్యంత నిర్దయగా, అవహేళనగా ప్రవర్తించిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహశీల్దార్ చిట్టంపల్లి స్వామిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఆర్డీవో (RDO) ఇచ్చిన ప్రాథమిక విచారణ నివేదిక ఆధారంగా కలెక్టర్ కె. హైమావతి ఆయనను సస్పెండ్ చేస్తూ శనివారం అర్ధరాత్రి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
'పురుగుల మందు తాగలేదా' అంటూ అవహేళన:
భూ సమస్య పరిష్కారం కోసం తన వద్దకు వచ్చిన రైతును ఉద్దేశించి "నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా.. ఇంకా బతికే ఉన్నావా?" అంటూ తహశీల్దార్ స్వామి అత్యంత అమానవీయంగా వ్యాఖ్యానించారు. తన ఆవేదన చూసి నవ్వొస్తుందా అని సదరు రైతు కంటతడి పెట్టుకుంటూ ప్రశ్నించగా.. "అవును వస్తది, బరాబర్ వస్తది" అని ఏమాత్రం బాధ్యత లేకుండా సమాధానమిచ్చారు.
సోషల్ మీడియాలో వైరల్ - ప్రభుత్వం తక్షణ స్పందన:
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో ప్రజలు, నెటిజన్లు, రాజకీయ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతన్నల పట్ల ఇంతటి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన సదరు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వెల్లువెత్తడంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఘటనపై విచారణకు కలెక్టర్ ఆదేశించగా, ఆర్డీవో అందించిన నివేదిక ఆధారంగా కలెక్టర్ హైమావతి సస్పెన్షన్ చర్యలు తీసుకున్నారు.