ఓటరు సమగ్ర సవరణ (SIR)పై ప్రతిపక్షాలది అసత్య ప్రచారం.. స్వచ్ఛమైన ఓటరు జాబితా రూపకల్పనే ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాదగిరి సునీల్ రావు

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ
దేశవ్యాప్తంగా నిర్వహించిన ఓటరు సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై ప్రతిపక్ష పార్టీలు లేనిపోని అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగర డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు తీవ్రంగా మండిపడ్డారు. కరీంనగర్‌లోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
పకడ్బందీగా ఓటరు జాబితా నమోదు:
దేశంలో దాదాపు 95 కోట్ల మంది ఓటర్లకు సంబంధించిన ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ఇందులో 82 కోట్ల మంది ఓటర్లు అన్ని ప్రక్రియలు పూర్తి చేసుకుని కొత్త జాబితాలో ఎన్‌రోల్ అయ్యారని, ఇందులో 88 శాతం మంది పాత ఓటర్లే ఉన్నారని స్పష్టం చేశారు. మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ అయిన వారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓట్లు ఉన్న ఫేక్ ఓటర్ల వివరాలను విచారణ చేపట్టిన తర్వాతే బిఎల్ఒలు, అధికారులు 'షిఫ్టెడ్, ఆబ్సెంట్, డెత్' కేటగిరీల్లో చేర్చారని వివరించారు.
ఫారం-7 పై అసత్య ఆరోపణలు తగవు:
ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు ఫారం-7 ద్వారా ఓటర్లను అక్రమంగా తొలగిస్తున్నారనడం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. ఫారం-6 ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు లభిస్తుందని పేర్కొన్నారు. కేరళలోని కాంగ్రెస్ నాయకులు ఎస్ఐఆర్ వల్ల దొంగ ఓట్లు తొలగిపోయి మేలు జరిగిందని ప్రశంసిస్తుంటే, ఇక్కడి కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష నేతలు మాత్రం ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ డ్రామాలు ఆడటం సిగ్గుచేటన్నారు.
ఆధారాలు ఉంటే కలెక్టర్‌కు ఇవ్వండి - సవాల్:
కరీంనగర్ జిల్లాలో లేదా రాష్ట్రంలో "మా ఓటు పోయింది" అని ఏ ఒక్క ఓటరు అయినా దరఖాస్తు ఇస్తే దాన్ని బహిరంగపరచాలని, లేదంటే జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారులకు సమర్పించాలని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. ప్రధాని నరేంద్ర మోడీకి వస్తున్న ప్రజాదరణను ఓర్వలేకే ప్రతిపక్షాలు ఇటువంటి దిగజారుడు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు.
ఈ సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు తోట అనిల్, మాసం గణేష్, కొంపెల్లి రామన్, సోమిడి వేణు ప్రసాద్, పొన్నం మొండయ్య గౌడ్, కర్రే అనిల్, కోఆప్షన్ సభ్యులు సర్దార్ బల్బీర్ సింగ్, నాయకులు పండుగ నాగరాజు, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.