వాస్తవాలు రాస్తే.. కక్షసాధింపులా?

రాజీవ్ చౌక్ కథనంతో 'తెలంగాణ అడ్డ'పై ఎదురుదాడి
మరమ్మతులు నిజమైతే.. మా వార్త తప్పెలా అయింది?
ప్రశ్నిస్తే పోలీస్ కేసులు.. నోటీసులతో బెదిరింపులా?
మీడియా గొంతు నొక్కే పన్నాగంపై 'తెలంగాణ అడ్డ' ప్రత్యేక కథనాలు
కరీంనగర్ బ్యూరో, తెలంగాణ అడ్డ:
ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియా రంగం ప్రజల పక్షాన నిలబడి నిగ్గుతేల్చే వాస్తవాలు కొందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ప్రజాధనాన్ని కాజేసే నాసిరకం పనులను, అధికారిక నిధుల వ్యయం వెనుక దాగి ఉన్న లొసుగులను బహిర్గతం చేస్తే, దిద్దు బాటు చర్యలు చేపట్టాల్సింది పోయి, ఎదురుదాడికి దిగే సరికొత్త సంస్కృతి కరీంనగర్లో తెరపైకి వచ్చింది. ఒక ప్రజా సమస్యను వెలుగులోకి తెచ్చినందుకు అధికార శక్తులు వ్యవస్థలను అడ్డం పెట్టుకుని మీడియా పై, పాత్రికేయుడిపై కక్షసాధింపు చర్యలకు తెగబడ్డాయి. అసలు ఈ వ్యవహారంలో ఏం జరిగింది? నిజాలు రాసినందుకు ఎలా వేట మొదలుపెట్టారు? అన్న పూర్తి వాస్తవాలను పాఠకుల ముందు ఉంచేందుకు 'తెలంగాణ అడ్డ' ఈ ప్రత్యేక కథనాల పరంపరను ప్రారంభిస్తోంది.
అసలు ఏమి జరిగింది?
కరీంనగర్ నగర నడిబొడ్డున ఉన్న అత్యంత రద్దీ ప్రాంతమైన రాజీవ్ చౌక్ సుందరీకరణ పనుల కోసం సుడా నిధుల నుంచి సుమారు రూ.15 లక్షలు వెచ్చించారు. అయితే, ఆవిష్కరించిన ఐదు నెలలకే అక్కడ అమర్చిన డెకరేటివ్ పైపులు ఊడిపోయి, నాణ్యతా ప్రమాణాలు గాల్లో కలిసిపోయిన వైనాన్ని అక్టోబర్ 3న 'తెలంగాణ అడ్డ' ఛాయాచిత్రాలతో సహా బట్టబయలు చేసింది. ప్రజాధనం దుర్వినియోగం కాకూడదన్న సదుద్దేశంతో ప్రసారమైన కథనంతో ఉలిక్కిపడ్డ అధికార యంత్రాంగం, అక్టోబర్ 6 నాటికి సిబ్బందిని రంగంలోకి దించి, ఊడిపోయిన పైపులను బిగించి యుద్ధప్రాతిపదికన పనులను పూర్తి చేయించింది. క్షేత్రస్థాయిలో జరిగిన ఈ మరమ్మతులే కథనంలోని వార్తా వాస్తవికతకు తిరుగులేని రుజువుగా నిలిచాయి. అయితే సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హయాంలో ప్రస్తావించి, ప్రతిపాదించిన, చేపట్టిన పనుల్లో నాణ్యతా లోపాలకు ఎవరు జవాబుదారీ? అన్న ప్రజా వాదనను 'తెలంగాణ అడ్డ' లేవనెత్తింది. గతంలో జరిగిన అక్రమాలను ఎత్తిచూపుతూ, విచారణ జరిపిస్తామన్న నాయకులే, అధికారంలోకి వచ్చాక ఇలాంటి నాసిరకం పనులకు పాల్పడడం ఏంటనే ప్రజల వాదనను, వారి డిమాండ్‌తో 'తెలంగాణ అడ్డ' మీడియా ప్రస్తావించింది.
జర్నలిస్టుపై ప్రతీకార దాడి.. తప్పు కప్పిపుచ్చుకునేందుకేనా?

క్షేత్రస్థాయిలో లోపాలను చక్కదిద్దుకున్నప్పటికీ, నిధుల వినియోగంపై సమాధానం చెప్పాల్సిన పెద్దలు మాత్రం తమ రాజకీయ పరపతి ఎక్కడ దెబ్బతింటుందోనన్న అసహనంతో రగిలిపోయారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రాసిన వార్తపై ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది పోయి, వార్త రాసిన కలంపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుచరులను రంగంలోకి దించి ఒకవైపు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించడం, మరోవైపు పరువునష్టం పేరుతో నోటీసులు పంపడం వంటి ద్వంద్వ వ్యూహానికి తెరలేపారు. ప్రజా సమస్యలపై గళమెత్తే జర్నలిస్టుల నోరు మూయించడమే లక్ష్యంగా కుట్రపూరిత అడుగులు వేశారు.
ఎఫ్ఐఆర్ అస్త్రం.. అక్రమ సెక్షన్ల జోడింపు
ఈ పన్నాగంలో భాగంగా అక్టోబర్ 3న కరీంనగర్ 2-టౌన్ పోలీస్ స్టేషన్లో 'తెలంగాణ అడ్డ' బ్యూరో ఇన్ ఛార్జ్ ప్రతినిధిపై అధికార పార్టీ అనుబంధ విభాగం నాయకుడితో ఫిర్యాదు ఇప్పించారు. ప్రజాధనం ఖర్చుపై విజిలెన్స్ విచారణ కోరడం నేరమన్నట్టుగా చిత్రీకరిస్తూ, రెండు రాజకీయ పక్షాల మధ్య వైషమ్యాలు రగిల్చారనే నెపంతో భారతీయ న్యాయ సంహిత 352, 353(2) వంటి తీవ్రమైన సెక్షన్లతో క్రైమ్ నంబర్ 599/2026 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. ప్రజా సమస్యపై రాసిన కథనానికి శాంతిభద్రతల ముసుగు తగిలించి క్రిమినల్ కేసుగా మార్చడంలో పోలీసు యంత్రాంగం చూపిన అత్యుత్సాహం వెనుక ఉన్న అధికారిక ఒత్తిళ్లు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.
పరువు నష్టం ముసుగులో 25 లక్షల బెదిరింపు నోటీస్
పోలీస్ కేసు నమోదుతో ఆగకుండా, మరుసటి రోజే న్యాయవాది ద్వారా 'తెలంగాణ అడ్డ' యాజమాన్యానికి ఏకంగా రూ.25 లక్షల పరువునష్టం లీగల్ నోటీసు పంపించారు. వార్తను అన్ని సామాజిక మాధ్యమాల నుంచి వెంటనే తొలగించాలని, తమ మీడియాలో బేషరతు క్షమాపణ చెప్పాలని, లేకుంటే సివిల్, క్రిమినల్ దావాలు వేస్తామని ఆ నోటీసులో హెచ్చరించారు. ప్రజా సమస్యను ప్రశ్నించినందుకు కోట్లాది రూపాయల జరిమానాలు, జైలు శిక్షల పేరుతో పాత్రికేయులను లొంగదీసుకోవాలని చూడటం అధికార దురహంకారానికి పరాకాష్టగా మారింది.
సత్యమే మా ఆయుధం న్యాయపోరాటానికి సిద్ధం
రాజీవ్ చౌక్ వద్ద పనులను బాగుచేసిన చేతులే, అదే వాస్తవాలను వెలికితీసిన కలంపై కేసులు బనాయించాలని చూడటం హాస్యాస్పదం. బెదిరింపులతో జర్నలిస్టుల గొంతు నొక్కవచ్చనుకోవడం పాలకుల భ్రమ మాత్రమే. రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛతో, ప్రజల పక్షాన నిలబడి ఈ అక్రమ కేసులను, నోటీసుల వెనుక ఉన్న డొల్లతనాన్ని ఆధారాలతో సహా తిప్పికొట్టేందుకు 'తెలంగాణ అడ్డ' సిద్ధంగా ఉంది.
ప్రజా సమస్యపై రాసిన వార్తకు విద్వేషాల ముసుగేసి పెట్టిన ఎఫ్ఐఆర్ డొల్లతనం.. పోలీసుల అత్యుత్సాహంపై ప్రత్యేక కథనం.. రెండవ భాగం రేపటి ఎపిసోడ్లో ..!