Back to Home
Watermark
బుధవారం, 14 అక్టోబర్, 2026 TIME : 05:41 PM

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి!

Main Image

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:

నిరవధిక సమ్మెకు భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు – నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు

సమ్మె శిబిరాన్ని సందర్శించి ఉద్యోగుల పోరాటానికి సంఘీభావం

తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హెల్త్ మిషన్ కింద సేవలందిస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బంది తమ న్యాయమైన హక్కుల సాధన కోసం చేపట్టిన నిరవధిక సమ్మెకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా కరీంనగర్‌లో ఎన్‌హెచ్‌ఎం సిబ్బంది చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగర డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు పాల్గొని మాట్లాడారు.

కరోనా కష్టకాలంలో సేవ చేసిన వారిపై నిర్లక్ష్యం సరికాదు:

కోవిడ్ మహమ్మారి విజృంభించిన క్లిష్ట సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రాత్రింబవళ్లు శ్రమించి ప్రజల ప్రాణాలు కాపాడిన వైద్య సిబ్బంది పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య ధోరణి అవలంబించడం విచారకరమని యాదగిరి సునీల్ రావు మండిపడ్డారు

Additional Image

రెగ్యులరైజేషన్ మరియు నిధుల పంపిణీ:

ఎన్‌హెచ్‌ఎం పరిధిలోని సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం అరవై శాతానికి పైగా నిధులు ఇస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం తన నలబై శాతం వాటాను ఇవ్వడంలో వైఫల్యం చెందిందన్నారు. కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, దీనివల్ల ప్రభుత్వానికి అదనపు ఆర్థిక భారం పడదని స్పష్టం చేశారు.

వేతనాలు మరియు సమాన హక్కులు:

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం క్యాడర్ ఫిక్సేషన్ అమలు చేసి వంద శాతం గ్రాస్ జీతం ఇవ్వాలని, ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేసి, స్పర్శ్ ద్వారా నేరుగా స్టేట్ హెల్త్ సొసైటీ నుంచే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఆరోగ్య భద్రత మరియు ప్రసూతి సెలవులు:

మహిళా సిబ్బందికి నూట ఎనభై రోజుల (ఆరు నెలల) వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలన్నారు. ఈహెచ్‌ఎస్, ఈఎస్‌ఐ సౌకర్యాలు ಕల్పించడంతో పాటు విధుల్లో ఉండి మరణించిన ఉద్యోగి కుటుంబానికి ఇరవై లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా మరియు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు.పెండింగ్ బకాయిల విడుదల: ప్రతి నెలా ఐదవ తేదీలోగా జీతాలు చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న తొమ్మిది నెలల పీఆర్‌సీ మరియు ఏరియర్స్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే హెల్త్ సిబ్బంది సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో బాధితులకు మద్దతుగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Clip Adjustments