Back to Home
Watermark
శుక్రవారం, 16 అక్టోబర్, 2026 TIME : 05:45 PM

కరువు నివారణలో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన విమర్శలు

Main Image

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:

ముందస్తు చర్యలు చేపట్టడంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలం

రైతు కూలీలకు రూ. 12 వేల ఆర్థిక సహాయం, లైఫ్ ఇన్సూరెన్స్ అందించాలని డిమాండ్

రాష్ట్రంలో తలెత్తిన తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొవడంలో మరియు ముందస్తు చర్యలు చేపట్టడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.ఈ ఏడాది జనవరిలోనే ఎల్ నినో పరిస్థితులు ఉంటాయని ప్రపంచం మొత్తం హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, అప్పటి నుంచి ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టలేదని ఆమె ప్రశ్నించారు. ఆగస్టులో 28 శాతం వర్షాపాతం తక్కువగా నమోదైతే పక్క రాష్ట్రాలు అప్రమత్తమై కరువు మండలాలను ప్రకటించి నివేదికలు ఇచ్చాయని, కానీ మన రాష్ట్రంలో మాత్రం ఆ చర్యలు లేవని దుయ్యబట్టారు. నిన్న ముఖ్యమంత్రి నిర్వహించిన ప్రెస్ మీట్ పూర్తిగా ఆయన నిస్సహాయతను, ప్రతిపక్షాలను తిట్టడానికే సరిపోయిందని విమర్శించారు.

ప్రెస్ మీట్‌లో కవిత లేవనెత్తిన ముఖ్యాంశాలు:

విద్యుత్ రంగం - ప్రైవేటీకరణ: రాష్ట్రం కరువులో ఉంటే యాదాద్రి పవర్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించేప్రయత్నాలుజరుగుతున్నాయని,

పవర్ మ్యాక్స్ కంపెనీతో ఉన్న ఒప్పందం ఏంటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. నవంబర్ వరకు అడుక్కుంటారో, కొనుక్కొస్తారో రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాన్ని వెంటనే మానుకోవాలని హెచ్చరించారు.

రైతు కూలీల సంక్షేమం: పనిలేక ఐజా మండలం నుంచి కర్ణాటకకు వలస పోతున్న కార్మికుల్లో ఇద్దరు ప్రమాదంలో చనిపోవడం, ఐదు మంది గాయపడటం బాధాకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతు కూలీలకు రూ. 12 వేల పథకాన్ని వెంటనే అమలు చేయాలని, 40 శాతం మంది భూమి లేని కూలీలకు లైఫ్ ఇన్సూరెన్స్ చేయించాలని డిమాండ్ చేశారు.

నీటి పారుదల ప్రాజెక్ట్లు: అధికారంలోకి వచ్చి 30 నెలలు గడుస్తున్నా పాలమూరు-రంగారెడ్డి, బీమా, నెట్టంపాడు ప్రాజెక్టులను పూర్తి చేయలేదని, మేడిగడ్డ బ్యారేజ్‌ను రిపేర్ చేయకుండా పాత ప్రభుత్వాన్ని నిందిస్తూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే పది నెలల పాటు వర్షాలు లేనందున మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా నీరు అందించే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

హైదరాబాద్ తాగునీటి కరువు: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హైదరాబాద్‌లో 8 వేల చెరువులు మాయమయ్యాయని, దానివల్లనే భూగర్భ జలాలు అడుగంటి నీళ్ల కరువు వచ్చిందని ఆరోపించారు. హైడ్రా ఏం చేస్తోందని, చెరువులకు సంబంధించిన రిపోర్ట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కేటీఆర్ తీరుపై విమర్శలు: ప్రతిమ శ్రీనివాస్‌పై విచారణ చేయాలని లేఖ రాయడం కేటీఆర్ నైజాన్ని బయటపెట్టిందని, నమ్మిన వాళ్లను నట్టేట ముంచడం ఆయన నైజమని అన్నారు. ఉద్యమ సమయంలో పార్టీకి సాయం చేసిన వారిపై ఇలా వ్యవహరించడం సరైంది కాదన్నారు. అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు.

సింగరేణి కార్మికులు: సింగరేణిలో కేటీఆర్ పెట్టిన సభ కార్మికుల కోసం కాకుండా రాజకీయాల కోసం పెట్టినట్లు ఉందని, కార్మికులకు మెడికల్ బోర్డు పెట్టించడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు. రానున్న సింగరేణి ఎన్నికల్లో హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ విజయం సాధిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

ప్రభుత్వ వైఫల్యాలు: రాష్ట్రంలో కరువుతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే సీఎం గోవా, ఢిల్లీలకు తిరుగుతూ ప్రజాస్వామ్యంపై లెక్చర్లు ఇస్తున్నారని, అదే రాష్ట్రంలో రైతులకు బేడీలు వేయిస్తున్నారని విమర్శించారు. పత్రికా మిత్రులు పోలీసుల అవినీతిపై వార్తలు రాస్తే కొట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టాలు వచ్చినప్పుడు కళాకారులు, సినిమా వాళ్లు, అఖిలపక్షం గుర్తుకు వస్తున్నాయా అని నిలదీశారు.ఈ సంక్షోభ సమయంలో తాము రైతులకు అండగా ఉంటామని, అవసరమైతే కిషన్ రెడ్డి, బండి సంజయ్లను కూడా కలుస్తామని కవిత స్పష్టం చేశారు. కేసీఆర్ గారి ఫామ్‌హౌస్‌లో అసైన్డ్ ల్యాండ్ గురించి తనకు అవగాహన లేదని స్పష్టం చేశారు.

Clip Adjustments