Back to Home
Watermark
శుక్రవారం, 16 అక్టోబర్, 2026 TIME : 06:24 PM

నెంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడిపే వాళ్ళ పై ప్రత్యేక రంగు బోర్డుల ప్రదర్శన చట్టం అందరికీ సమానమేనా?

Main Image

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:

నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలకు చట్టపరమైన చర్యలేవి?

అధికారుల మౌనం వెనుక ఆంతర్యమేమిటి?

మోటార్ వాహనాల చట్టం నిబంధనలు ఇవే సామాన్యులకు ఒక న్యాయం, నాయకులకు మరో న్యాయమా?

భారత రాజ్యాంగం దృష్టిలో చట్టం ముందు అందరూ సమానులే. దేశాన్ని నడిపించే చట్టాలు, నిబంధనలు సామాన్యులతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారంలో ఉన్నవారందరికీ సమానంగా వర్తించాలి. కానీ, ఆచరణలో మాత్రం నిబంధనల అమలులో పక్షపాత ధోరణి కనిపిస్తుందనే విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నామినేటెడ్ పదవులు పూర్తయిన కొందరు మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఇప్పటికీ తమ వాహనాలకు సరైన నంబర్ ప్లేట్లకు బదులుగా హోదాలు రాసుకుని, ప్రత్యేక రంగు బోర్డులతో తిరుగుతుండటం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.

నిబంధనలు ఏం చెబుతున్నాయి?

చట్టపరమైన సెక్షన్లు ఇవే:

మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ప్రతీ వాహనానికి రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ (HSRP) స్పష్టంగా ప్రదర్శించడం తప్పనిసరి. నంబర్ ప్లేట్ లేకుండా లేదా ఫ్యాన్సీ/హోదా బోర్డులతో వాహనాలను నడిపితే తీవ్రమైన చట్టపరమైన చర్యలు ఉంటాయి మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 80, 50, 51 (CMVR): వాహనాల నంబర్ ప్లేట్ల పరిమాణం, అక్షరాల శైలి, రంగుల అమరికపై స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. వీటిని ఉల్లంఘిస్తే వాహనం రిజిస్ట్రేషన్ చెల్లదు మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 192 (Section 192, MV Act): నంబర్ ప్లేట్ లేకుండా లేదా తప్పుడు/అనధికారిక నంబర్ ప్లేట్లతో వాహనాలు నడిపితే భారీ జరిమానా విధించబడుతుంది. మొదటిసారి ఉల్లంఘిస్తే రూ. 2,000 నుండి రూ. 5,000 వరకు జరిమానా, మళ్లీ అదే తప్పు పునరావృతమైతే రూ. 10,000 వరకు జరిమానా లేదా జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

భారతీయ న్యాయ సంహిత (BNS) / ఐపీసీ సెక్షన్లు: నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతూ, విధుల్లో ఉన్న అధికారులను తప్పుదోవ పట్టించేలా ప్రవర్తిస్తే మోసపూరిత వైఖరి కింద కేసులు నమోదు చేసే అవకాశం కూడా ఉంటుంది.

మినహాయింపులు: కేవలం రాష్ట్రపతి, గవర్నర్లు, సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు వంటి అత్యున్నత రాజ్యాంగ హోదా ఉన్నవారి వాహనాలకు మాత్రమే నంబర్ ప్లేట్ల మినహాయింపు ఉంటుంది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, నామినేటెడ్ నాయకులు కూడా తప్పనిసరిగా సాధారణ నంబర్ ప్లేట్లను వాడాల్సిందే.

అధికారుల మౌనం వెనుక ఆంతర్యమేమిటి?

సామాన్యులు వాహన పత్రాలు, హెల్మెట్ లేదా చిన్నపాటి నిబంధన ఉల్లంఘిస్తే చాలు.. ట్రాఫిక్ పోలీసులు క్షణం కూడా ఆలస్యం చేయకుండా వాహనాలు ఆపి సెక్షన్ల కింద ఈ-చలానాలు, భారీగా జరిమానాలు విధిస్తున్నారు. కానీ, నిబంధనలకు విరుద్ధంగా నంబర్ ప్లేట్ లేకుండా, ప్రత్యేక రంగు బోర్డులతో తిరుగుతున్న ఆ నాయకుల కార్లు పోలీసుల కంటపడటం లేదా? లేక అధికార బలంతో రవాణా శాఖ (ఆర్టీఏ), ట్రాఫిక్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారా? అనే ప్రశ్నలు ప్రజల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. అధికారుల ఈ ఉదాసీన వైఖరి వల్ల చట్టం పట్ల ప్రజల్లో నమ్మకం సడలిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రజల డిమాండ్

"చట్టం సామాన్యులకో కోణంలో. ప్రముఖులకో మరో కోణంలో పనిచేస్తుందా?"

అని కరీంనగర్ ప్రజలు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించి, ప్రజలను తప్పుదోవ పట్టించేలా నంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న ఆయా వాహనాలపై వెంటనే రవాణా శాఖ మరియు ట్రాఫిక్ పోలీసులు మోటార్ వాహనాల చట్టం ప్రకారం సీరియస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులైనా, మాజీలైనా అందరికీ చట్టం ఒక్కటేనని, నిబంధనలు అతిక్రమిస్తే ఎవరైనా సరే శిక్షకు అర్హులవుతారని చేతల్లో నిరూపించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంది.

Clip Adjustments