మానస పిల్లల ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలి ప్రైవేట్ ఆసుపత్రుల్లో తనిఖీలు చేపట్టాలి.. డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గాంతుల మహేష్

రాజన్న సిరిసిల్ల తెలంగాణ అడ్డా ప్రతినిధి వైద్యం పేరుతో పేద ప్రజలపై అధిక బిల్లుల భారం మోపుతున్నారనే ఆరోపణలపై మానస పిల్లల ఆసుపత్రిపై విచారణ జరిపి, నిబంధనల ఉల్లంఘనలు నిర్ధారణ అయితే చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గాంతుల మహేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా వైద్యాధికారికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ జిల్లాలో అనుమతులు, అగ్నిమాపక భద్రత, ఇతర వైద్య ప్రమాణాలు పాటించకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై అధికారులు తనిఖీలు చేపట్టాలని కోరారు. ఆసుపత్రుల్లో ధరల పట్టికలు ప్రదర్శించడం లేదని, రోగులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా అధిక మొత్తంలో బిల్లులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు.
మానస పిల్లల ఆసుపత్రి సమీపంలోని డ్రైనేజీ సమస్యను పరిష్కరించడంలో సంబంధిత అధికారులు, ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఒకే భవనంలో మానస పిల్లల ఆసుపత్రి, వినాయక డెంటల్ ఆసుపత్రి నిర్వహణపై కూడా అధికారులు పరిశీలన జరపాలని కోరారు.
ఇటీవల జరిగిన ఘటనలో బాధితులకు న్యాయం చేయాలని, ఆసుపత్రి నిర్వహణకు సంబంధించిన అనుమతులు, భద్రతా ప్రమాణాలు పరిశీలించి నిబంధనల ఉల్లంఘనలు తేలితే ఆసుపత్రిని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకోకపోతే ఆసుపత్రి ఎదుట ధర్నా చేపడతామని హెచ్చరించారు.