ఎన్ హెచ్ఎం ఉద్యోగుల జీతాలు తగ్గించడం అన్యాయం తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

కేంద్రం నిధులు ఇచ్చినా వేతనాల్లో కోతలు పెట్టడం సరికాదు
దేశంలోని ఏడు రాష్ట్రాలు ఎన్ హెచ్ఎం ఉద్యోగులను రెగ్యులర్ చేశాయి
నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ హెచ్ఎం) ఉద్యోగుల జీతాలు తగ్గిస్తూ ప్రభుత్వం జీవో 1195 తేవడం అన్యాయమని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఎన్ హెచ్ఎం ఉద్యోగుల జేఏసీ నాయకులతో కలిసి బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు.
జీతాల్లో కోతలు - వివక్ష: రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల మంది ఉద్యోగులుంటే వారిలో కొంతమంది వేతనాలు రూ. 4 వేల నుంచి రూ. 5 వేలు తగ్గించారని, మరికొందరి వేతనాలు మాత్రం పెంచారని.. ఉద్యోగుల పట్ల ఇంత వివక్ష ఎందుకని ఆమె ప్రశ్నించారు. ద్రవ్యోల్బణం పెరుగుతున్న తరుణంలో జీతాలు తగ్గించడం దారుణమన్నారు.
కేంద్ర నిధులు, ప్రభుత్వ నిర్లక్ష్యం: ఉద్యోగుల వేతనాల కోసం కేంద్రం నిధులు ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం సమయానికి వేతనాలు ఇవ్వడం లేదని, నిధులను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు.
రెగ్యులరైజేషన్ డిమాండ్: దేశంలోని ఏడు రాష్ట్రాల్లో (కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్తో పాటు) ఎన్ హెచ్ఎం ఉద్యోగులను రెగ్యులర్ చేశారని గుర్తు చేశారు. ఏపీలో 30 శాతం జీతాలు పెంచి రెగ్యులరైజ్ చేస్తామని అసెంబ్లీలో తీర్మానం చేశారని తెలిపారు.
ప్రజా ఉద్యమ హెచ్చరిక: సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి హెల్త్ మినిస్టర్కు తగిన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే తాము రంగంలోకి దిగి పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.