బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:
వివిధ గ్రామాల్లో పర్యటించి తెలంగాణ ఆడపడుచులకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
గన్నేరువరం, మానకొండూరు మండలాల్లో ఘనంగా పూల పండుగ వేడుకలు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకల్లో మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదివారం పాల్గొని సందడి చేశారు. వివిధ గ్రామాల్లో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు హాజరై మహిళలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
గుండ్లపల్లి మరియు జంగపల్లి పర్యటన: గన్నేరువరం మండల పరిధిలోని గుండ్లపల్లి ఎక్స్‌రోడ్డులో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని మహిళలతో ముచ్చటించారు. అనంతరం జంగపల్లి గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న దుర్గాదేవి వేడుకలకు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత గన్నేరువరం మండల కేంద్రంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొని మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.
మానకొండూరు మండలంలో సందడి:
మానకొండూరు మండల కేంద్రంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు కూడా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పండుగను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడం సంతోషకరమన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.
వెల్దిలో వేడుకలు: అనంతరం వెల్ది సహా పలు గ్రామాల్లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని మహిళలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.