Back to Home
Watermark
సోమవారం, 19 అక్టోబర్, 2026 TIME : 03:31 PM

జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం హేయం సిట్ ద్వారా విచారణ జరిపించాలి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ డిమాండ్

Main Image

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:

దెబ్బతిన్న ఏక్ ధమ్ న్యూస్ జర్నలిస్టులను కరీంనగర్‌లో పరామర్శించిన బీఆర్ఎస్ నేత

పోలీసు గుండాయిజంపై డీజీపీ, ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీత

రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలనలో పోలీసులే గుండాలుగా ప్రవర్తిస్తూ, నేరాలకు పాల్పడుతున్నారని.. చేయని నేరానికి జర్నలిస్టులపై అక్రమ కేసులు నమోదు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించి అత్యంత పాశవికంగా హింసించారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

కరీంనగర్‌లో చికిత్స పొందుతున్న బాధిత జర్నలిస్టులను సోమవారం ఆయన పరామర్శించి, బాధితులకు సంఘీభావం తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఘటన వివరాలు మరియు ప్రధాన తీవ్ర ఆరోపణలు:

Additional Image

జర్నలిస్టులపై దాడి: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో భూ తగాదాల్లో పోలీసులు తలదూర్చిన విషయమై కథనాలు ప్రచురించినందుకు 'ఏక్ ధమ్ న్యూస్' రిపోర్టర్లపై అక్రమ కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. గంభీరావుపేట ఎస్సై శ్రీకాంత్ ఇద్దరు జర్నలిస్టులపై పీఎస్‌లో థర్డ్ డిగ్రీ ప్రయోగించి హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు.

ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు?: గాయాలపాలై, చేతులు విరిగి, తీవ్రంగా గాయపడిన బాధిత జర్నలిస్టులు కరీంనగర్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎస్సై మరియు దాడి చేసిన సిబ్బందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడం అత్యంత దారుణమని నిలదీశారు.

డీజీపీ, అధికారుల వైఖరిపై ప్రశ్నలు: ప్రతిరోజు సమీక్షలు నిర్వహించే డీజీపీ సి.వి. ఆనంద్ ఈ తీవ్రమైన విషయంపై ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. రాజ్యాంగ నిబంధనలు, డి.కె. బసు కేసు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తుంగలో తొక్కి పోలీసులు కర్కశంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సిఐడి / సిట్ విచారణకు డిమాండ్: ఏక్ ధమ్ న్యూస్ పదేళ్లుగా గుర్తింపు పొందిన పత్రికగా పనిచేస్తోందని తెలిపారు. ఎస్సై ఎవరి ఆదేశాల మేరకు జర్నలిస్టులపై దాడి చేశారో తేలాలని, ఈ ఘటనపై పారదర్శక విచారణ కోసం కేసును సీఐడీకి అప్పగించాలని లేదా 'సిట్' (SIT) ఏర్పాటు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి పాలనలో ఇప్పటికే పోలీసుల చేతిలో దళిత యువకుడు కర్ల రాజేష్ హత్యగావించబడ్డారని, ఇప్పుడు సిరిసిల్లాలో మరో దళిత జర్నలిస్టుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు. దాడి చేసిన వారి వెనుక ఎంతటి పెద్దవారున్నా వదిలిపెట్టేది లేదని, బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండి పోరాడుతుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొంకటి శేఖర్, ఊరుమల్ల విశ్వం, మేకల రవీందర్, మొలుమ్మూరి చంద్రశేఖర్, దొబ్బెల ప్రేమ్, సంజీవ్, కల్లేపల్లి అరవింద్, మనోజ్, కిరణ్, వెంకటేష్, మణిదీప్ తదితరులు పాల్గొన్నారు.

Clip Adjustments