Back to Home
Watermark
సోమవారం, 19 అక్టోబర్, 2026 TIME : 06:53 PM

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపం దసరా పండుగ ప్రజలందరూ సుఖసంతోషాలతో పండుగ జరుపుకోవాలి: పొలాస నరేందర్

Main Image

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి

తెలంగాణ అడ్డా ప్రతినిధి వేములవాడ:

చెడుపై మంచి, అన్యాయంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి పండుగ అని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, మాజీ సర్పంచ్, ఉత్తర తెలంగాణ జిల్లాల బీసీ నాయకుడు పొలాస నరేందర్ అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచే విజయదశమి పండుగను రాష్ట్ర ప్రజలందరూ ఆనందోత్సాహాలతో, వైభవంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా స్నేహితులు, బంధువులు, పార్టీ శ్రేణులు, మీడియా మిత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, శ్రేయోభిలాషులందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా పొలాస నరేందర్ మాట్లాడుతూ.. దసరా పండుగ తెలంగాణ గ్రామీణ జీవన విధానాన్ని, సంప్రదాయాలను ప్రతిబింబించే అత్యంత పవిత్రమైన, సంతోషకరమైన పండుగ అని పేర్కొన్నారు. చెడుపై, అన్యాయంపై, దుర్మార్గంపై మంచి సాధించిన విజయానికి దసరా ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ప్రకృతి ఆరాధనతో పాటు సామాజిక ఐక్యతను చాటిచెప్పే ఈ పండుగ ధర్మం, శాంతి, పట్టుదల వంటి సద్గుణాలు ఎప్పటికైనా విజయాన్ని సాధిస్తాయనే గొప్ప సందేశాన్ని అందిస్తుందని వివరించారు.

ఆయుధ పూజకు ప్రత్యేక ప్రాధాన్యం

దసరా పర్వదినం సందర్భంగా ప్రజలు తమ నిత్యజీవితంలో జీవనోపాధి కోసం ఉపయోగించే పరికరాలు, ఆయుధాలు, యంత్రాలు, వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని నరేందర్ తెలిపారు. మహిషాసురుడితో తొమ్మిది రోజుల పాటు భీకర యుద్ధం చేసిన దుర్గామాత పదో రోజున అసురుడిని సంహరించి విజయం సాధించినట్లు పురాణాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ విజయదశమి వేడుకలను జరుపుకుంటారని వివరించారు.

జమ్మి పూజ.. బంగారం ఇచ్చిపుచ్చుకోవడం ప్రత్యేకం

తెలంగాణ ప్రాంతంలో విజయదశమి పండుగకు ప్రత్యేకమైన సంప్రదాయాలు ఉన్నాయని నరేందర్ అన్నారు. పండుగ రోజున కొత్త వస్త్రాలు ధరించి, జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించి, జమ్మి ఆకులను బంగారంగా భావించి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. పెద్దల ఆశీర్వాదాలు తీసుకుంటూ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకోవడం ఈ పండుగ ప్రత్యేకతగా పేర్కొన్నారు.

పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై దాచిపెట్టి, అజ్ఞాతవాసం ముగిసిన అనంతరం విజయదశమి రోజున తిరిగి వచ్చి జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించి ఆయుధాలను తీసుకున్నారనే పురాణ గాథ ఈ సంప్రదాయానికి ప్రాధాన్యతను చాటుతుందని వివరించారు.

పాలపిట్ట దర్శనం శుభసూచకం

విజయదశమి రోజున పాలపిట్టను దర్శించుకోవడం శుభప్రదమని ప్రజల్లో నమ్మకం ఉందని నరేందర్ తెలిపారు. పాండవులు అజ్ఞాతవాసం ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో పాలపిట్ట దర్శనం ఇవ్వడంతో మహాభారత యుద్ధంలో విజయం సాధించారని, అలాగే శ్రీరాముడు రావణాసురుడిపై యుద్ధానికి వెళ్లే ముందు పాలపిట్టను దర్శించుకోవడంతో విజయాన్ని అందుకున్నారని పురాణ గాథలు చెబుతున్నాయని పేర్కొన్నారు.

ప్రజలందరికీ విజయాలు చేకూరాలి

దసరా పండుగ ప్రజల మధ్య ప్రేమానురాగాలను పెంపొందించి, సామాజిక ఐక్యతను బలోపేతం చేయాలని పొలాస నరేందర్ ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, విజయాలు కలగాలని కోరుకున్నారు. తెలంగాణ ప్రజలు సాంప్రదాయాలను కాపాడుకుంటూ, సోదరభావంతో, ప్రశాంత వాతావరణంలో విజయదశమి పండుగను ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

Clip Adjustments