Back to Home
Watermark
సోమవారం, 19 అక్టోబర్, 2026 TIME : 07:35 PM

రైతుల పక్షాన మూడు డిమాండ్లు చేస్తున్నాం: తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

Main Image

పంటలు వేయొద్దని చెప్పడానికి ప్రభుత్వానికి సిగ్గుండాలి

తెలంగాణ అడ్డా ప్రతినిధి కరీంనగర్ బ్యూరో:

సాగునీరు అందక ఎండిపోతున్న పంటలను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. కరీంనగర్ రూరల్ మండలం మొగ్దుంపురం గ్రామంలో సాగునీరు అందక ఎండిపోయిన పంటలను ఆమె పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంటలు ఎండిపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పంటలు నష్టపోతున్న రైతులకు ధైర్యం చెప్పి ఓదార్చారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. రైతులను పంటలు వేయవద్దని చెప్పడానికి ప్రభుత్వానికి సిగ్గుండాలని వ్యాఖ్యానించారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా రైతులకు వ్యవసాయం చేయవద్దని చెప్పలేదని అన్నారు. రైతులు వ్యవసాయం మానేయాలని చెబుతున్న ముఖ్యమంత్రి తన రాజకీయాలను బంద్ పెడతారా? అని ప్రశ్నించారు.

ప్రాణహిత నీటితో పంటలను కాపాడాలి

కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని కవిత విమర్శించారు. ప్రాజెక్టు విజయవంతమైందా లేదా అనే అంశాన్ని పక్కనపెడితే, రైతులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. ప్రాణహిత నది వద్ద చిన్న కాఫర్ డ్యామ్ నిర్మించి నీటిని ఎత్తిపోస్తే 35 నుంచి 40 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి బేషజాలకు పోకుండా వెంటనే ఈ దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

కరీంనగర్‌కు సమీపంలో ఉన్న మొగ్దుంపురం గ్రామంలో పంటలు ఎండిపోతున్నా పరిశీలించేందుకు అధికారులు రాకపోవడం బాధాకరమన్నారు. జిల్లా కలెక్టర్ గ్రామాన్ని సందర్శించి పంట నష్టం ఎంత జరిగిందో అంచనా వేయాలని కోరారు.

రైతులకు నష్టపరిహారం అందించారు

పంట నష్టంపై సరైన లెక్కలు సేకరించకుండా కేంద్ర ప్రభుత్వాన్ని సాయం అడుగుతామని చెప్పడం ద్వారా ముఖ్యమంత్రి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని కవిత ఆరోపించారు. కేంద్రాన్ని సాయం అడగాలంటే ముందుగా రైతులకు జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని సూచించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఒక్కో రైతుకు సుమారు రూ.50 వేల వరకు నష్టం జరుగుతోందని ఆమె పేర్కొన్నారు. రాజకీయాల కోసం నీటిని ఎత్తిపోకుండా రైతులకు నష్టం కలిగించడం సమంజసం కాదన్నారు. రాబోయే రోజుల్లోనూ వర్షాలు తక్కువగా పడే అవకాశం ఉందనే అంచనాల నేపథ్యంలో ప్రాణహిత నీటిని వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

మూడు డిమాండ్

ప్రస్తుత పంటలను కాపాడాలంటే ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. తమ పార్టీ తరఫున మూడు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచుతున్నట్లు తెలిపారు.

1. రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలి.

2. ప్రాణహిత నుంచి నీటిని ఎత్తిపోసి పంటలకు సాగునీరు అందించాలి.

3. ఎండిపోయిన పంటల వల్ల రైతులకు జరిగిన నష్టాన్ని సమగ్రంగా అంచనా వేయాలి.

ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల పంటలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కల్వకుంట్ల కవిత కోరారు.

Clip Adjustments