కరీంనగర్ టు శబరిమల ‘మహా పాదయాత్ర’ ఘనంగా ప్రారంభం

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా
భగత్ నగర్ అయ్యప్ప ఆలయంలో ఇరుముడి పూజలు.. జెండా ఊపి యాత్రను ప్రారంభించిన కావేటి పరమేశ్వర గురుస్వామి
45 రోజుల పాటు 6 రాష్ట్రాల గుండా సాగనున్న యాత్ర.. డిసెంబర్ 12న శబరిమల సన్నిధాన దర్శనం
కరీంనగర్ నగరంలోని భగత్ నగర్ అయ్యప్ప స్వామి దేవాలయం నుండి ‘కరీంనగర్ టు శబరిమల’ అయ్యప్ప స్వాముల మహా పాదయాత్ర బుధవారం అత్యంత భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా ప్రారంభమైంది. శ్రీ గడప నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో, ఆలయ ప్రధాన అర్చకులు మంగళంపల్లి రాజేశ్వర శర్మ గారి వేదమంత్రోచ్ఛారణల మధ్య అయ్యప్ప స్వాములు ఇరుముడి కట్టుకుని యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ మహా పాదయాత్రను శ్రీ కావేటి పరమేశ్వర గురుస్వామి కొబ్బరికాయ కొట్టి, జెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు.మొత్తం 45 రోజుల పాటు అత్యంత కఠినమైన నియమ నిష్ఠలతో సాగే ఈ పాదయాత్ర తెలంగాణలోని కరీంనగర్, హైదరాబాద్ మార్గాల గుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను దాటుకుంటూ కేరళలోని శబరిమల క్షేత్రానికి చేరుకుంటుంది. డిసెంబర్ 12వ తేదీన స్వాములు శబరిమల అయ్యప్ప స్వామి వారిని దర్శించుకోనున్నారు.
కరీంనగర్ సహా వివిధ జిల్లాల నుండి 60 మంది స్వాములు

ఈ మహా పాదయాత్రలో శ్రీ గడప నాగరాజు గురుస్వామితో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని మంథని, పెద్దపల్లి, జగిత్యాల మరియు మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రాంతాలకు చెందిన దాదాపు 60 మంది అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాగరాజు గురుస్వామి మాట్లాడుతూ.. భక్తుల సహాయ సహకారాలతో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి ప్రత్యేక ఆశీస్సులతో ఈ పాదయాత్ర బృందం బయలుదేరుతోందని తెలిపారు. పాదయాత్ర విజయవంతమై, స్వాములందరూ క్షేమంగా శబరిమల చేరుకుని తిరిగి రావాలని అయ్యప్ప స్వామిని వేడుకున్నట్లు పేర్కొన్నారు.
గిద్ద పెరుమాండ్ల స్వామి ఆలయంలో అన్నదానం
పాదయాత్ర ప్రారంభం అనంతరం, నగరంలోని గిద్ద పెరుమాండ్ల స్వామి దేవాలయంలో 9వ డివిజన్ కార్పొరేటర్ పడిశెట్టి వసంత లక్ష్మి - భూమయ్య దంపతులు పాదయాత్ర స్వాములకు ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి దేవాలయం చైర్మన్ యాగండ్ల అనిల్ కుమార్, ప్రధాన అర్చకులు మంగళంపల్లి రాజేశ్వర శర్మ, డింగరి చాణక్య, కావేటి పరమేశ్వర గురుస్వామి, డి. సంపత్ గురుస్వామి, పోలు సత్యనారాయణ గురుస్వామి, పెద్దపల్లి సాయన్న గురుస్వామి, రుద్రాక్ష కృష్ణ, శ్రావణ్ స్వామి, రంజిత్ స్వామి, గ్యాస్ శ్రీను స్వామి, హరి స్వామి, జీవన్ స్వామి మరియు దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.