మాదకద్రవ్యాల నివారణపై ఉక్కుపాదం కరీంనగర్ కమిషనరేట్‌లో NDPS కేసులపై ఈగిల్ టీమ్ ఎస్పీ, సీపీ ఉన్నత స్థాయి సమీక్ష

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:
నిందితులకు బెయిల్, రెమిషన్ రాని విధంగా కఠిన చట్టాలు ప్రయోగించాలి: ఈగిల్ టీమ్ ఎస్పీ గిరిధర్
-కరీంనగర్‌ను 'డ్రగ్ ఫ్రీ' కమిషనరేట్‌గా తీర్చిదిద్దుతాం: సీపీ గౌష్ ఆలం
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) కేసులపై గురువారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా విచ్చేసిన తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఈగిల్ టీమ్) ఎస్పీ గిరిధర్ మరియు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, ఐపీఎస్ ల సంయుక్త ఆధ్వర్యంలో కమిషనరేట్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న ఎన్డిపిఎస్ కేసుల దర్యాప్తు పురోగతిపై సమగ్ర సమీక్ష చేపట్టారు.సమావేశంలో నమోదైన కేసుల పురోగతిని సమీక్షించిన ఎస్పీ గిరిధర్, దర్యాప్తు ఆలస్యానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దర్యాప్తు అధికారులకు పలు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు.
సమీక్షా సమావేశంలో జారీ చేసిన కీలక ఆదేశాలు
డ్రగ్ పెడ్లర్లపై నిరంతర నిఘా గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాలను సరఫరా చేసే ప్రధాన సప్లైయర్ (పెడ్లర్) వ్యవస్థను మూలాల నుండి ఛేదించాలని ఆదేశించారు.
కఠిన చట్టాలు & ఛార్జిషీట్లు దర్యాప్తు అధికారులు ఎన్డిపిఎస్ చట్టాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, నిందితులకు సులభంగా బెయిల్ రాకుండా, భవిష్యత్తులో శిక్షా కాలంలో రెమిషన్ పొందే అవకాశం లేని కఠినమైన చట్టపరమైన విభాగాలు ప్రయోగించాలని సూచించారు. కోర్టుల్లో నేరం రుజువు చేసి శిక్షల శాతం పెంచినప్పుడే గంజాయిని పూర్తిగా నిర్మూలించగలమని స్పష్టం చేశారు.
కళాశాలల్లో అవగాహన & డీ-అడిక్షన్ కేంద్రాలపై నిఘా
యువత, విద్యార్థులు మాదకద్రవ్యాల బారిన పడకుండా కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని, అలాగే డీ-అడిక్షన్ కేంద్రాల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు.కన్స్యూమర్లకు కౌన్సిలింగ్ఈ సందర్భంగా గంజాయి వినియోగిస్తున్న పలువురు కన్స్యూమర్లకు సీపీ మరియు ఎస్పీలు స్వయంగా ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించి, మత్తు పదార్థాల వల్ల జీవితాలు ఎలా నాశనమవుతాయో వివరించి మార్పు తెచ్చే ప్రయత్నం చేశారు.
సీపీ గౌష్ ఆలం స్పందన
ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ.. కరీంనగర్ కమిషనరేట్‌ను సంపూర్ణంగా ‘మాదకద్రవ్య రహిత (డ్రగ్ ఫ్రీ) కమిషనరేట్‌గా’ తీర్చిదిద్దేందుకు రాజీ లేని కర్తవ్య నిర్వహణతో ముందుకుసాగుతామని ప్రకటించారు. మత్తు పదార్థాల రవాణా, విక్రయాల అడ్డుకట్టకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడతారని స్పష్టం చేశారు.ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో కరీంనగర్ ఏసీపీలు వెంకటస్వామి, విజయకుమార్, మాధవి, ఈగల్ టీమ్ ఏసీపీలు ఉపేందర్, సోమనాథ్, పుష్పన్ కుమార్, వివిధ స్టేషన్ల సీఐలు, ఎస్సైలు మరియు దర్యాప్తు అధికారులు పాల్గొన్నారు.