Back to Home
Watermark
ఆదివారం, 01 నవంబర్, 2026 TIME : 01:58 PM

ఎంఐఎం నూతన కార్యవర్గంతో వేడెక్కుతున్న రాజకీయా సమీకరణాలు

Main Image

కరీంనగర్ బ్యూరో,తెలంగాణ అడ్డా

కరీంనగర్ రాజకీయం ఓటు బ్యాంకుగానే మైనారిటీలు ప్రాంతీయంగా శాసించే నాయకత్వం ఏదీ?

కాంగ్రెస్, బీఆర్ఎస్ ధోరణితో ప్రత్యామ్నాయం వైపు చూపు

రాజకీయాల్లో ఎప్పుడూ నిర్ణయాత్మక శక్తిగా ఉండే మైనారిటీ వర్గాలు ఇప్పుడు తమ రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర పునరాలోచనలో పడ్డాయి. నగరంలో దాదాపు 40 వేల నుండి 50 వేల పైచిలుకు నిర్ణయాత్మక ఓటు బ్యాంకు కలిగిన ఈ వర్గానికి, స్థానిక రాజకీయాల్లో దక్కాల్సిన ప్రాతినిధ్యం మరియు గుర్తింపు ఎంతవరకు లభిస్తోందనేది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. దశాబ్దాలుగా ఓట్లేసి గెలిపిస్తున్నప్పటికీ, మైనారిటీ సమాజం నుండి ఒక స్వతంత్రమైన, ప్రాంతీయ రాజకీయాలను శాసించగలిగే బలమైన నాయకుడు ఉద్భవించకుండా ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా అణచివేస్తున్నాయనే అభిప్రాయం క్షేత్రస్థాయిలో వ్యక్తమవుతోంది.

అధికారంలో ఉన్నా దక్కని పదవులు

మైనారిటీల్లో అసంతృప్తి జ్వాలలు

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ, కరీంనగర్ జిల్లా మరియు టౌన్ స్థాయిలో మైనారిటీ నేతలకు తగిన గుర్తింపు దక్కలేదనే ఆవేదన వ్యక్తమవుతోంది. పార్టీ సంస్థాగత పదవుల్లో కానీ, కార్పొరేషన్లు, నామినేటెడ్ పదవుల్లో కానీ మైనారిటీ నాయకులకు తగిన స్థానం కల్పించకపోవడంపై తీవ్ర అసంతృప్తి జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి.

దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండా మోసిన సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ, అధికార పీఠం దక్కిన వేళ వారిని పక్కన పెట్టడం వెనుక ఉన్న వ్యూహమేమిటో అర్థం కావడం లేదని ద్వితీయ శ్రేణి నాయకులు మండిపడుతున్నారు. నామినేటెడ్ పదవుల్లో కనీస ప్రాతినిధ్యం కూడా ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ పట్ల మైనారిటీ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

బీఆర్ఎస్‌లో అనుచరులుగానే పరిమితం

గంగుల వ్యూహాలపై విస్తృత చర్చ

మరోవైపు, సుదీర్ఘకాలం పాటు కరీంనగర్ ప్రజాప్రతినిధిగా, మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన గంగుల కమలాకర్ రాజకీయ శైలి పై కూడా మైనారిటీ వర్గాల్లో తీవ్రమైన చర్చ నడుస్తోంది. "నాకు మైనారిటీలందరితో నేరుగా సంబంధాలు ఉన్నాయి" అనే విధానంతో, సొంత సమాజం నుండి ఒక బలమైన ద్వితీయ శ్రేణి నాయకుడు ఉద్భవించకుండా చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

గతంలో నామినేటెడ్ పదవులు లేదా పార్టీ బాధ్యతలు పొందిన బీఆర్ఎస్ మైనారిటీ నాయకులు సైతం కేవలం ఉత్సవ విగ్రహాలుగా మారారే తప్ప, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని పొందలేకపోయారు. నాయకత్వ సామర్థ్యం ఉన్నవారిని సైతం తమ నీడలోనే ఉంచుకుంటూ, ఒక స్వతంత్ర మైనారిటీ శక్తిగా ఎదగనీయకుండా పక్కన పెట్టారనే విషయంపై ప్రస్తుతం పొలిటికల్ సర్కిళ్లలో తీవ్రమైన చర్చ జరుగుతోంది.

ఎంఐఎం నూతన శకం రాబోయే అసెంబ్లీ, కార్పొరేషన్ ఎన్నికలే లక్ష్యంగా అడుగులు

ఇలాంటి రాజకీయ శూన్యత మరియు ప్రధాన పార్టీల నిర్లక్ష్య వైఖరి నడుమ ఎంఐఎం పార్టీ ప్రకటించిన నూతన కార్యవర్గం కరీంనగర్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేపింది. నూతనంగా నియమితులైన టౌన్ మరియు జిల్లా అధ్యక్షులు, కార్యవర్గ సభ్యుల్లో నూతన ఉత్సాహం కనిపిస్తుండటంతో పాటు, రాజకీయ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఎంఐఎం ఒక ఆకర్షణీయమైన వేదికగా మారుతోంది.

ఇప్పటి నుంచే రాబోయే నియోజకవర్గ (అసెంబ్లీ) ఎన్నికలతో పాటు, రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలో సైతం తమ గెలుపోటములను ప్రభావితం చేసేలా ఎంఐఎం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో నాయకత్వ అవకాశాలు రాక, గుర్తింపు దక్కక ఆవేదన చెందుతున్న ద్వితీయ శ్రేణి మైనారిటీ నాయకులు మరియు కార్యకర్తలు ఇప్పుడు ఎంఐఎం వైపు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. కేవలం ఓటు బ్యాంకుగా మారిపోకుండా, స్వయంగా రాజకీయాన్ని శాసించే దిశగా మైనారిటీలు అడుగులు వేయాల్సిన సమయం వచ్చిందనే భావన ఎంఐఎం కొత్త కార్యవర్గ రాకతో మరింత బలపడింది.

రాబోయే ఎన్నికల్లో దెబ్బ ఎవరికి?

కరీంనగర్ రాజకీయాల్లో ఉద్భవిస్తున్న ఈ కొత్త ధోరణి రాబోయే కార్పొరేషన్ మరియు అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. బీఆర్ఎస్ దశాబ్ద కాలంగా కాపాడుకుంటూ వచ్చిన మైనారిటీ ఓటు బ్యాంకు, అలాగే కాంగ్రెస్ గంపగుత్తగా ఆశించిన మద్దతు ఈసారి చిన్నాభిన్నమయ్యే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. నాయకత్వాన్ని ఎదగనీయని ప్రధాన పార్టీలకు చెక్ పెడుతూ, మైనారిటీ సమాజం తమ సొంత రాజకీయ ప్రాతినిధ్యం వైపు మొగ్గు చూపితే కరీంనగర్ రాజకీయ చిత్రం పూర్తిగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

Clip Adjustments