Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

సుడా చైర్మన్ తీరుపై కాంగ్రెస్‌లో భగ్గుమన్న వర్గపోరు.. పదవుల లాలసపై సొంత పార్టీలోనే తీవ్ర విమర్శలు

Author Mohammad azeem | 07 Sep 2026, 03:36 PM |
 సుడా చైర్మన్ తీరుపై కాంగ్రెస్‌లో భగ్గుమన్న వర్గపోరు.. పదవుల లాలసపై సొంత పార్టీలోనే తీవ్ర విమర్శలు

సుడా చైర్మన్ తీరుపై కాంగ్రెస్‌లో భగ్గుమన్న వర్గపోరు.. పదవుల లాలసపై సొంత పార్టీలోనే తీవ్ర విమర్శలు

​కరీంనగర్ బ్యూరో/ తెలంగాణ అడ్డా

​కరీంనగర్ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలు మరోసారి రోడ్డెక్కాయి. సుడా (SUDA) చైర్మన్ కొమటిరెడ్డి నరేందర్ రెడ్డి వ్యవహారశైలి, పార్టీలోని ఇతర సీనియర్ నాయకులను లక్ష్యంగా చేసుకుని సాగిస్తున్న ప్రచారంపై సొంత పార్టీలోనే తీవ్ర చర్చనీయాంశమైంది. పదవుల కోసం పార్టీని అడ్డుపెట్టుకుంటున్నారనే ఆరోపణలు ఇప్పుడు కేవలం గుసగుసలుగా కాకుండా బహిరంగ విమర్శలకు తావిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

​గతంలో నగర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో "నేను లేకుంటే పార్టీ లేదు" అన్నట్లుగా వ్యవహరించడం, కేవలం పదవుల అనుభవమే లక్ష్యంగా రాజకీయాలు సాగిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. పదవులు లేకపోతే పార్టీ మారే తత్వం ఉందనే వాదన కార్యకర్తల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. పార్టీలో తన చుట్టూ ఉన్న నలుగురు అనుచరులకే ప్రాధాన్యతనిస్తూ, కిందిస్థాయి నాయకులను లేదా ఇతర సమర్థులైన నేతలను ఎదగకుండా అణిచివేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో వేరే వాళ్ళు ఎవరూ ఎదగకూడదనే ఏకపక్ష ధోరణి ప్రదర్శిస్తున్నారని పార్టీ వర్గాలు మండిపడుతున్నాయి.

​గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థి ఓటమికి కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన, ప్రస్తుతం పార్టీలో తన పదవికి ఎక్కడ ఎసరు వస్తుందనే భయంతో సొంత పార్టీ నేతల పైనే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థుల తరహాలో పోస్టులు పెట్టిస్తూ, పార్టీ నాయకుల మధ్య చిచ్చు పెడుతున్నారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల (13 జిల్లాలకు) ఎమ్మెల్సీగా పోటీ చేసిన ఆల్ఫోర్స్ వి. నరేందర్ రెడ్డిని కించపరిచేలా, ఆయన వ్యక్తిత్వానికి భంగం కలిగించే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, ప్రత్యర్థి పార్టీల సభల్లోని ఫొటోలను జోడించి దుష్ప్రచారం చేయడం వంటి చర్యలు పార్టీలో తీవ్ర విమర్శలకు దారితీశాయి. సుడా చైర్మన్ పదవి ఆశించడమే ఆల్ఫోర్స్ వి. నరేందర్ రెడ్డి చేసిన తప్పా? అని పార్టీ శ్రేణులు నిలదీస్తున్నాయి.

​సుడా చైర్మన్ పదవి వచ్చినప్పటికీ, తన పరిధిలోని శాఖలో సరైన సమన్వయం లేకుండా, బాధ్యతాయుతంగా వ్యవహరించకుండా కేవలం రాజకీయ ఆధిపత్యం కోసమే పావులు కదుపుతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. "నేనే ఉంటేనే పార్టీ... నాకే పదవులు దక్కాలి" అనే అహంకార పూరిత ధోరణి పార్టీకి ఎంతవరకు మేలు చేస్తుందని కిందిస్థాయి కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. పదవుల కోసం సొంత పార్టీ నేతలనే కించపరిచేలా ప్రచారం చేయడం, గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహించడం వల్ల రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ హైకమాండ్ ఇప్పటికైనా స్పందించి, ఇలాంటి అంతర్గత కుమ్ములాటలకు, కుట్ర రాజకీయాలకు తక్షణమే అడ్డుకట్ట వేయాలని పార్టీ శ్రేణులు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి.