Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

మహిళలకు, ముఖ్యంగా బీసీ మహిళలకు దక్కిన గౌరవం: రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్ పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి బాధ్యతల స్వీకరణ

Author Mohammad azeem | 07 Sep 2026, 07:25 PM |
మహిళలకు, ముఖ్యంగా బీసీ మహిళలకు దక్కిన గౌరవం: రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్ పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా:
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్ పర్సన్‌గా, క్యాబినెట్ మంత్రి హోదాతో శ్రీమతి గద్వాల విజయలక్ష్మి సోమవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ప్రజాభవన్‌కు విచ్చేసిన గద్వాల విజయలక్ష్మికి వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించి, వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య తొలి ఫైల్‌పై విజయలక్ష్మి సంతకం చేశారు. ఆ తర్వాత సీఎం ప్రజావాణి హాల్‌ను పరిశీలించి, అక్కడ ప్రజావాణి అమలవుతున్న తీరును విశ్లేషించారు.
ఈ సందర్భంగా గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కానీ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్ పర్సన్ పదవికి ఇప్పటి వరకు ఏ మహిళకూ అవకాశం లభించలేదని, తొలిసారిగా ఒక మహిళకు ఈ బాధ్యత అప్పగించడం చారిత్రాత్మక నిర్ణయం అని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని వ్యక్తిగతంగా వచ్చిన గౌరవంగా మాత్రమే కాకుండా, రాష్ట్రంలోని మహిళలకు, ముఖ్యంగా బీసీ మహిళలకు లభించిన గుర్తింపుగా, ప్రోత్సాహంగా భావిస్తున్నట్లు తెలిపారు. పరిపాలనలోనూ, నిర్ణయాలు తీసుకునే స్థాయిలోనూ మహిళలకు మరిన్ని అవకాశాలు రావాలనే బలమైన సందేశాన్ని ఈ నియామకం ఇస్తోందని అన్నారు.
రాష్ట్రంలో మూడు కీలకమైన పదవుల్లో మహిళలకు, ముఖ్యంగా బీసీ మహిళలకు అవకాశం కల్పించడం మహిళా సాధికారతకు, సామాజిక న్యాయానికి కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని తెలిపారు. తనపై విశ్వాసం ఉంచి ఈ గురుతర బాధ్యతను అప్పగించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కాంగ్రెస్ అగ్రనాయకత్వం సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కే.సి. వేణుగోపాల్, కుమారి మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సహా పార్టీ నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.