Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పట్టణ పేదల సొంతింటి కలకు తొలి అడుగు – రాయదుర్గంలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు శంకుస్థాపన

Author | 21 Sep 2026, 05:40 PM | TELANGANA
పట్టణ పేదల సొంతింటి కలకు తొలి అడుగు – రాయదుర్గంలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు శంకుస్థాపన

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా:
హైదరాబాద్‌ మహానగరంలోని జీహెచ్‌ఎంసీ పరిధిలో పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. శేరిలింగంపల్లి నియోజకవర్గం రాయదుర్గంలోని మల్కం చెరువు సమీపంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌ నిర్మాణానికి రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు.
ఆత్మగౌరవ చిరునామా: ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పట్టణ పేదలకు వారు నివసిస్తున్న ప్రాంతాలకు సాధ్యమైనంత దగ్గరలోనే సొంతింటిని అందించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి తెలిపారు. పేదలను నగరానికి దూరంగా తరలించడం కాకుండా, ఖరీదైన ప్రాంతాల్లోనే గౌరవంగా నివసించేలా ఇందిరమ్మ టవర్స్‌ను నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. ఎకరం వందల కోట్ల విలువ చేసే ప్రాంతంలో పేద కుటుంబాలకు ఇల్లు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం భద్రత, భరోసా కల్పిస్తోందన్నారు.
ఉచిత రిజిస్ట్రేషన్ - పూర్తి హక్కులు: ఇందిరమ్మ టవర్స్‌లో లబ్ధిదారులకు 17 నుంచి 20 గజాల వరకు అన్‌డివైడెడ్ షేర్‌తో పాటు అపార్ట్‌మెంట్‌పై పూర్తి హక్కులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని, సేల్ డీడ్‌ను రిజిస్ట్రేషన్ చార్జీలు లేకుండా అందించే విధంగా ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు.
పారదర్శక ఎంపిక: లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి రాజకీయ జోక్యానికి, పైరవీలకు తావులేదని స్పష్టం చేశారు. లాటరీ విధానంలో పారదర్శకంగా, అర్హత ఆధారంగానే ఎంపిక జరుగుతోందని, ఎవరి సిఫార్సులు, ఒత్తిళ్లకు లొంగకుండా హౌసింగ్ బోర్డు ఈ ప్రక్రియను పబ్లిక్‌గా నిర్వహిస్తోందన్నారు.
నిర్మాణ లక్ష్యాలు - గడువు: హైదరాబాద్ నగర పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, రాబోయే రెండున్నర సంవత్సరాల్లో అర్హులైన పేదలకు దశలవారీగా ఇళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే బోనాల నాటికి ఇక్కడి నుంచే లబ్ధిదారులతో బోనాలు ఎత్తించే విధంగా నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని తెలిపారు.
నాణ్యతలో రాజీ లేదు: నిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, లబ్దిదారులు వారానికి ఒకసారి వచ్చి పనులను పరిశీలించాలని సూచించారు. లోపాలు కనిపిస్తే అధికారులకు ఫిర్యాదు చేయాలని, వాటిని పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. ఇది ప్రభుత్వం ఇచ్చే బహుమతి కాదని, పిల్లల భవిష్యత్ తరాలకు మిగిలే ఆస్తి అని పేర్కొన్నారు.