Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

కరీంనగర్‌కు సీఎం రేవంత్ రెడ్డి.. సెప్టెంబర్ 30న నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం ఓటు చోరీ నిరసనగా ఈనెల 28న కలెక్టరేట్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపు.. ఎస్‌ఐఆర్ గడువును డిసెంబర్‌ వరకు పొడిగించాలని డిమాండ్

Author | 25 Sep 2026, 05:56 PM | TELANGANA
కరీంనగర్‌కు సీఎం రేవంత్ రెడ్డి.. సెప్టెంబర్ 30న నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం ఓటు చోరీ నిరసనగా ఈనెల 28న కలెక్టరేట్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపు.. ఎస్‌ఐఆర్ గడువును డిసెంబర్‌ వరకు పొడిగించాలని డిమాండ్

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:
కరీంనగర్ పట్టణంలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవానికి మరియు పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈనెల 30న విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇందిరా భవన్ డీసీసీ కార్యాలయంలో కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్, సీనియర్ నాయకులు కర్ర రాజశేఖర్, ఆకారపు భాస్కర్ రెడ్డి, మడుపు మోహన్ తదితరులు హాజరయ్యారు. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుని, ప్రధానంగా మూడు అంశాలపై చర్చించారు.
సీఎం పర్యటన - ఘన స్వాగత ఏర్పాట్లు: గత ప్రభుత్వం పదేళ్లుగా పెండింగ్‌లో పెట్టిన కలెక్టరేట్ భవనాన్ని ప్రజా ప్రభుత్వం పూర్తి చేసి ప్రారంభించడం చారిత్రాత్మకమని నాయకులు కొనియాడారు. నగర ప్రధాన కూడళ్లు, కలెక్టరేట్ మార్గంలో భారీ ఫ్లెక్సీలు, తోరణాలతో స్వాగతం పలకాలని, 66 డివిజన్లలో కాంగ్రెస్ జెండాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కష్టకాలంలో పార్టీని నమ్ముకున్న కార్యకర్తల కోసం సీఎంను కలిసేలా తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో లోపాలు - గడువు పొడిగింపు డిమాండ్: ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) ప్రక్రియలో సాఫ్ట్వేర్ లోపాల వల్ల పేర్ల స్పెల్లింగ్‌లు తప్పుగా నమోదు కావడం, ఇప్పటికీ 50% మందికి నోటీసులు అందకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. మైనారిటీలు, కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉన్నందున, ఈ గడువును అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ వరకు పొడిగించాలని డిమాండ్ చేశారు.
సెప్టెంబర్ 28న ఓటు చోరీపై కలెక్టరేట్ ముట్టడి: సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ, ఏఐసీసీ పిలుపు మేరకు సెప్టెంబర్ 28న కరీంనగర్ కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. "మనం కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉండాలి, మనుషులకు కాదు" అని స్పష్టం చేశారు. సీఎం పర్యటనను కరీంనగర్‌లో కాంగ్రెస్ పార్టీ బలాన్ని చాటే విధంగా విజయవంతం చేయాలని కార్పొరేషన్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ కోరారు. ఈ సమావేశంలో నగరంలోని పలువురు కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.