Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న పురస్కారం అందించాలి: కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Author | 26 Sep 2026, 09:05 PM | TELANGANA
డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న పురస్కారం అందించాలి: కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా:
భారతదేశ గొప్ప రాజనీతిజ్ఞుడు, ప్రముఖ ఆర్థికవేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి అత్యున్నత పురస్కారమైన 'భారతరత్న' అందించి గౌరవించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సరళీకృత ఆర్థిక విధానాలతో పాటు, స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చి తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి జ్ఞాపకార్థం దేశ రాజధాని ఢిల్లీ నగరంలో సముచితమైన విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని విప్రో సర్కిల్‌లో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నిర్మించిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి స్మారక పార్క్‌ను, ఆయన విగ్రహాన్ని ముఖ్యమంత్రి గారు ఘనంగా ఆవిష్కరించారు.
పాల్గొన్న ప్రముఖులు: ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సుప్రీంకోర్టు మాజీ ప్రధానమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి, ఆర్థిక మాజీ సలహాదారు మోహన్ గురుస్వామి, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, నవీన్ యాదవ్ తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
చారిత్రక సంస్కరణలు: దేశం ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితుల్లో పీవీ నరసింహారావు గారి ప్రధానమంత్రిత్వంలో ఆర్థిక సరళీకృత విధానాలను (లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్) అమలు చేసి దేశాన్ని గట్టెక్కించడంలో మన్మోహన్ సింగ్ పాత్ర మరువలేనిదని సీఎం గుర్తుచేశారు. ఆయన హయాంలోనే విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఆహార భద్రత హక్కు చట్టం వంటి విప్లవాత్మక చట్టాలు వచ్చాయని తెలిపారు.
తెలంగాణ ఏర్పాటుకు సంతకం: సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ నేతృత్వంలోనే తెలంగాణ స్వప్నం సాకారమైందని, రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై మన్మోహన్ సింగ్ పెట్టిన స్వదస్తూరి సంతకాన్ని ఈ పార్క్‌లో నిక్షిప్తం చేయడం జరిగిందని పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఆ మహనీయునికి భారతరత్న ఇవ్వకపోవడం విషాదకరమని, రాజకీయాలకు అతీతంగా ఆయనను గౌరవించాలని సీఎం స్పష్టం చేశారు.