Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

విద్య, వైద్య రంగాలపై ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తున్నాం: తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

Author | 26 Sep 2026, 09:47 PM | Politics, TELANGANA
విద్య, వైద్య రంగాలపై ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తున్నాం: తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డ:
బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి పరిపాలన చేతకానిదని, ఇది పూర్తిగా ఫెయిల్యూర్ సర్కార్ అని విమర్శించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో వైద్య, విద్య రంగాలు సంక్షోభంలో పడ్డాయని ఆరోపించారు.
పసిపిల్లల మరణాలపై ఆందోళన: ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో ఏటా వేలాది మంది పసిపిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌ రిమ్స్‌లో జరిగిన ఘటన అత్యంత హృదయ విదారకమని, రాష్ట్రంలో 2020 నుంచి ఇప్పటివరకు వేలాది మంది పిల్లలు చనిపోయినట్లు ఓ మిత్రుడు పంపిన డేటా చూసి రెండు రోజులు నిద్రపట్టలేదన్నారు.
వైద్య రంగానికి బడ్జెట్ కోత: వైద్య రంగానికి కేటాయించిన బడ్జెట్‌లో సగానికి పైగా ఖర్చు చేయలేదని, ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా పెండింగ్‌లో ఉన్నాయని విమర్శించారు. నిమ్స్‌లో బెడ్ దొరకడానికే సీఎం చెప్పాల్సిన పరిస్థితి ఉందని, నీలోఫర్ ఆసుపత్రిలో బెడ్స్ ఆక్యుపెన్సీ 200 శాతానికి చేరిందని తెలిపారు. కలెక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రులు, హాస్టళ్లను సందర్శించాలని డిమాండ్ చేశారు.
విద్యారంగం - మౌలిక వసతులు: రాష్ట్రంలోని చాలా పాఠశాలల్లో కనీసం బాత్‌రూమ్‌లు కూడా లేని పరిస్థితి ఉందని, టీఆర్ఎస్ నాయకులు వెళ్లి పరిశీలించి అవసరమైతే మన చందాలతోనే వాటిని బాగుచేద్దామని పిలుపునిచ్చారు. ఐటీడీఏ వద్ద నిధులు ఉన్నప్పటికీ ప్రభుత్వం వినియోగించుకోవడం లేదన్నారు.
ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ: ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన తరఫున కచ్చితంగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియలో క్లరికల్ మిస్టెక్స్‌తో ఓట్లు తొలగిస్తున్నారని, ఇది రాజ్యాంగ హక్కులను హరించడమేనని ఆరోపించారు.
సిరిసిల్ల పర్యటనపై డిమాండ్: సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్లలో సభలు పెడితే సరిపోదని, నేరెళ్ల బాధితులకు ఏం న్యాయం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు లేకపోవడం, ఎస్సీ కమిషన్ నివేదిక బయటకు రాకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని ఎండగట్టారు.