Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

సొంత భవనాలు లేని గ్రామ పంచాయతీలకు నూతన భవనాలు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

Author | 27 Sep 2026, 04:39 PM | TELANGANA
సొంత భవనాలు లేని గ్రామ పంచాయతీలకు నూతన భవనాలు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

మానకొండూరు ప్రతినిధి / తెలంగాణ అడ్డా:
సొంత భవనాలు లేని గ్రామ పంచాయతీలకు నూతన భవనాలు నిర్మించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఇల్లంతకుంట మండలం ముస్కానిపేట గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
పంచాయతీ వ్యవస్థ బలోపేతం: గత బీఆర్‌ఎస్‌ పాలనలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైందని ఎమ్మెల్యే ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితో పాటు పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతోందని, గ్రామాల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
భూ ఆక్రమణలపై విమర్శలు: బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ కుటుంబం, అప్పటి నేతలు ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జా చేశారని మండిపడ్డారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే కూడా అటవీ శాఖకు చెందిన ఐదు ఎకరాల భూమిని ఆక్రమించారని పేర్కొన్నారు. ఆక్రమించినట్లు తేలిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ఖాయమని స్పష్టం చేశారు.
అభివృద్ధి పనుల ప్రారంభం, భూమిపూజ: ముస్కానిపేట గ్రామంలో వీవో భవనం, అంగన్‌వాడీ భవనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న చిరుధాన్యాల గోదాం నిర్మాణ పనులకు, ఎస్సీ కాలనీలో రూ.20 లక్షలతో చేపట్టిన డ్రైనేజీ పనులకు భూమిపూజ చేశారు. అలాగే ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలోనూ డ్రైనేజీ పనులకు భూమిపూజ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, ముస్కానిపేట గ్రామ సర్పంచ్ కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఇల్లంతకుంట ప్యాక్స్ చైర్మన్ ఉట్కూరి వెంకటరమణారెడ్డి, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు మామిడి రాజు, పార్టీ నాయకులు ఐరెడ్డి మహేందర్‌రెడ్డి, గుడిసె ఐలయ్య, పసల వెంకటి, ఎలగందుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.